TG : 11న సీతారామ ట్రయల్ రన్.. పంద్రాగస్టున ప్రారంభించనున్న సీఎం

Update: 2024-08-09 10:15 GMT

సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి సర్వసిద్ధమైంది. ప్రాజెక్టులోని మూడు పంపు హౌసుల్లోని ఆరు పంపుల్లో ఇప్పటికే పనులు పూర్తి చేసి ప్రస్తుత పంట కాలానికి నీరు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత ప్రభుత్వం ప్రారంభించిన సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్, ఇందిరాసాగర్ రుద్రకోట లిఫ్ట్ ఇరిగేషన్ ఏకం చేసి సీతారామ ప్రాజెక్టుగా నిర్మించిన ఈ ప్రాజెక్టుతో ఖమ్మంలో 4లక్షలు, భద్రాచలంలో 3లక్షలు, మహబూబాబాద్ లో రెండున్నర లక్షల 36వేల ఎకరాలు సాగులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

సముద్ర మట్టానికి 200 మీటర్ల ఎత్తులో 52 గేట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో పూర్తి చేసింది. బీజీ కొత్తూరు పంపు ట్రయల్ రన్ ను విజయవంతంగా ఇప్పటికే నిర్వహించిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మరో రెండుపంపులను ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఈనెల 11న ముహూర్తం నిర్ణయించారు. కమాలాపుర్, పూసుగూడెం పంపు హౌజ్ ల్లోని మోటార్లను ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ పంపులు గంటకు 1500 క్యూసెక్కులు ఎత్తిపోయనున్నాయి. ట్రయల్ రన్ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు పర్యటన ఖరారు అయింది.

ఆగస్ట్ 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న నేపద్యంలో ముందుగా ట్రయిల్ రన్ నిర్వహించాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఈ నేపధ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుండి నేరుగా రెండో పంప్ హౌస్ వద్దకు చేరుకుని అక్కడ ఈనెల 11న ట్రయిల్ రన్ నిర్వహిస్తారు. అక్కడి నుంచి 3వ పంప్ ట్రయిల్ రన్ పూర్తి చేసుకుని వైరాకు చేరుకుంటారు. 15 ఆగస్టున సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం వైరాలో ఏర్పాటుచేస్తున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ ఏర్పాట్లను 11న ఉత్తమ్ సమీక్షించనున్నారు.

Tags:    

Similar News