Revanth reddy : భూ సేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయండి
తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవరించాలని... అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఆర్బిట్రేషన్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం.. అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలకు ఆమోదం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), జాతీయ రహదారుల విభాగం (ఎన్‌హెచ్), జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్), రహదారులు, భవనాల శాఖ, అటవీ శాఖ అధికారులతో సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులకు నెంబర్ల కేటాయింపు... సూత్రప్రాయ అంగీకారం తెలుపుతున్నా... తర్వాత ప్రక్రియలో ఆలస్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.. చిన్న చిన్న కారణాలతో పలు రహదారుల పనుల్లో జాప్యం వాటిల్లుతుండడం సరికాదని.. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులకు సీఎం సూచించారు. భూ సేకరణను వేగవంతం చేసి పరిహారం తక్షణమే అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని సూచించారు.