ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ప్రతి విద్యార్థికి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్ సేఫ్టీపై విద్యార్ధులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. బుధవారం రవాణా శాఖలో ఆదాయ మార్గాలను పెంచేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రవాణా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, కమిషనర్ ఇలంబత్రి, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు రమేష్, మమతలు పాల్గొన్నారు. గతంలో సీఎం నిర్వహించిన సమీక్షలో చేసిన సూచనలు ఎంత వరకు ముందుకు వెళ్తున్నాయని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఆటోల్లో విద్యార్థులను తీసుకొని ఓవర్ లోడ్ తో తీసుకెళ్తున్న వారిపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు రోడ్డు సేఫ్టీ పై ఆధునిక సాంకేతిక పద్ధతిలో కరికులం ఉండాలని తెలిపారు. ప్రతి సంవత్సరం దేశంలో రోడ్డు ప్రమాదాలలో లక్షా 60 వేల మంది మరణిస్తుండగా.. తెలంగాణలో 20 మంది మృత్యువాత చెందుతున్నారని వీటిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.