క్లాస్ రూముల్లో ఉండాల్సిన విద్యార్థులను నడిరోడ్డు ఎక్కించిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. చదువుకోవాల్సిన పిల్లలను అన్నం, తాగు నీళ్ళ కోసం పాదయాత్రలు చేసే దుస్థితికి రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. పోలీసులతో విద్యార్థులను అరెస్టులు చేయించిన చరిత్ర ఈ ఇందిరమ్మ రాజ్యానిది అని ధ్వజమెత్తారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, సమస్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక అడిగినా ప్రభుత్వంలో చలనం కలగడం లేదని హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు విద్యార్థులు ఇవ్వాలనుకున్న ఫిర్యాదుకు తక్షణం పరిష్కారం చూపించాలన్నారు.