SC: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడే విచారణ

సుప్రీంకోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ... స్పీకర్‌ను ఆదేశించగలదా అన్న చర్చ;

Update: 2025-02-10 04:15 GMT

బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. పోచారం శ్రీనివా‌స్‌రెడ్డి, ఎం.సంజయ్‌ కుమార్‌, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రిట్‌ పిటిషన్‌ వేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, కడియం శ్రీహరిపై చర్యలకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, కేపీ వివేకానంద్‌ వేర్వేరుగా స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ మూడు పిటిషన్లను కలిపి నేడు జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కే.వినోద్‌ చంద్రన్‌ ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.

అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు..

బీఆర్‌ఎస్‌ ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా స్పందించాలని ఈ నెల 4న పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. వారు ఎప్పటిలోగా సమాధానం ఇవ్వాలన్న అంశాన్ని మాత్రం నోటీసుల్లో ప్రస్తావించలేదు. గత విచారణలో భాగంగా హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని గతేడాది మార్చిలో చెప్పినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్‌రెడ్డి, వివేకానంద తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తగిన సమయంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు.

ఎమ్మెల్యేల వినతిని..

తమకు 3 నుంచి 4 నెలల సమయం ఇవ్వాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఫిరాయింపు ఎమ్మెల్యేలు కోరారు. కాగా, నిర్ణీత సమయంలో అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశించవచ్చా? లేదా? అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. నిజానికి వివిధ న్యాయస్థానాల్లో ఈ విషయంపై వేర్వేరు తీర్పులు వచ్చాయి. గతంలో మణిపూర్‌ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ, మహారాష్ట్ర ఎమ్మెల్యేల కేసులో జస్టిస్‌ సుభాష్‌ దేశాయ్‌, జస్టిస్‌ ఖోటో హోల్లోహాన్‌, జస్టిస్‌ రాజేంద్రసింగ్‌ రాణా, జస్టిస్‌ కే మేఘచంద్రతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాత్రం అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ హేతుబద్ధ సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించిందే తప్ప నిర్దిష్ట సమయాన్ని పేర్కొనలేదు. ఇక, మరో కేసులో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే బాధ్యతలు స్పీకర్‌కు అప్పగించాలా? లేదా? అన్న విషయంపై పార్లమెంటే పునరాలోచించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Tags:    

Similar News