TS : ఎన్నికల విధులకు రాని 40 మంది సస్పెన్షన్‌

Update: 2024-05-09 06:26 GMT

ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 40 మంది ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులను సస్పెండ్‌ చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రోస్‌ తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ విధుల నిర్వహణ డ్యూటీలు కేటాయించిన వివిధ శాఖలకు చెందిన 40 మంది పీఓ, ఏపీఓలు శిక్షణా తరగతులకు రాకపోవడంతోపాటు.. పలుమార్లు వారి మొబైల్‌ నెంబర్లకు సందేశాలు పంపినా స్పందించలేదని పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం(ఆర్‌పీ యాక్ట్‌)–1951 ఉల్లంఘన కింద వారిని సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు. నేడు, రేపు మరికొందరు పీఓ, ఏపీఓలకు శిక్షణ ఉందని, గైర్హాజరైన వారి విషయంలో ఇదే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన 210 మంది 9, 10 తేదీల్లో జరగనున్న తుది దశ శిక్షణ తరగతులకు హాజరవ్వాల్సి ఉందన్నారు.

హైదరాబాద్‌ పార్లమెంటుకు 30 మంది, సికింద్రాబాద్‌ ఎంపీ స్థానానికి 45 మంది బరిలో ఉన్నారు. కంటోన్మెంట్‌ ఉపఎన్నికకు 15 మంది పోటీ చేస్తున్నారు. కంటోన్మెంట్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఒక బ్యాలెట్‌ యూనిట్‌ అసెంబ్లీకి, 22 మంది ఎంపీ అభ్యర్థులకు రెండు చొప్పున బ్యాలెట్‌ యూనిట్లను వేర్వేరుగా ఏర్పాటు చేయాలి. వాటన్నింటినీ సమన్వయం చేసుకోడానికి ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక పీఓ, ఇద్దరు ఏపీఓలు, ముగ్గురు ఓపీఓలు అవసరం. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ పార్లమెంటు ఎన్నికలు జరగనున్న 14 అసెంబ్లీ స్థానాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో మాత్రం.. ఒక పీఓ, ఇద్దరు ఏపీఓలు, ఒక ఓపీఓ మాత్రమే ఉంటారని రోనాల్డ్‌రోస్‌ చెప్పారు.

Tags:    

Similar News