Anganwadi Teacher : అనుమానాస్పదస్థితిలో అంగన్‌వాడీ టీచర్‌ మృతి

Update: 2024-05-16 06:44 GMT

అంగన్‌వాడీ టీచర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో బుధవారం వెలుగుచూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన రడం సుజాత (50) తాడ్వాయి మండలం కాటాపూర్‌లో 25ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. నిత్యం చిన్నబోయినపల్లి నుంచి కాటాపూర్‌కు వెళ్లివచ్చేది.

ఈక్రమంలో మంగళవారం కాటాపూర్‌ నుంచి తిరిగి వెళ్లేందుకు సుజాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బస్టాండ్‌కు చేరుకుని బస్సు కోసం వేచిచూస్తుండగా ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ఆమెను తాడ్వాయి వైపు తీసుకెళ్లినట్టు తెలిసింది. ఆ వ్యక్తే తాడ్వాయి–కాటాపూర్‌ మార్గమధ్యలో బైకు నిలిపి ఆమెను సుమారు అర కిలోమీటరు దూరం అడవిలోకి తీసుకెళ్లి.. ఆమె మెడకు చున్నీచుట్టి హత్యచేయడంతోపాటు ఆమె సెల్‌ఫోన్‌, బంగారు గోపితాడు తీసుకుని పరారైనట్టు అనుమానిస్తున్నారు.

బుధవారం ఉదయం తునికాకు సేకరణకు వెళ్లిన కూలీలకు ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పస్రా సీఐ శంకర్‌, స్థానిక ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుమారుడు చరణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసి హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరిచయస్థులే ఆమెను హతమార్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News