Revanth Reddy: ధర్నాలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్.. రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు..
Revanth Reddy: తెలంగాణలో పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, సర్పంచ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ధర్నాలకు పిలుపునిచ్చింది.;
Revanth Reddy: తెలంగాణలో పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, సర్పంచ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ధర్నాలకు పిలుపునిచ్చింది.. ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళనలకు నేతలు పిలుపునిచ్చారు.. అయితే, ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు.. అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తయ్యారు..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ నిర్బంధించారు.. అటు గాంధీభవన్ దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు.. గాంధీభవన్ నుంచి నేతలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. పోలీసుల తీరుపై హస్తం నేతలు మండిపడుతున్నారు.. శాంతియుతంగా ధర్నా చేస్తామంటున్నా ప్రభుత్వం అణచివేసే ధోరణి అవలంబిస్తోందని ఫైరవుతున్నారు.
అటు అరెస్టులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.. మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకో, దిష్టిబొమ్మల దహనంతోపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.. సర్పంచ్‌ల నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కాంగ్రెస్ ధర్నాలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం దుర్మార్గమన్నారు.. తెల్లవారుజాము నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలందరినీ గృహ నిర్బంధం చేసి అప్రజాస్వామికంగా, నియంతలాగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.