మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ ( CM Revanth Reddy ) దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదట్లో విస్తరణ ఉండొచ్చంటున్నారు. ఇప్పటికే అధిష్ఠానంతో రేవంత్ చర్చించినట్లు సమాచారం. సీఎంతో పాటు కేబినెట్‌లో ప్రస్తుతం 11మంది మంత్రులున్నారు. ఇప్పటికైతే నలుగురికి అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోం శాఖతో పాటు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ &అర్బన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, విద్య వంటి కీలక శాఖలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు కసర్తతు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఢిల్లీ పెద్దలతో చర్చించగా.. విస్తరణకు అదిష్ఠానం ఓకే చెప్పిందని గాంధీ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజ్‌లకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రిగా చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. విస్తరణలో శ్రీహరికి ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పేరు సైతం తెరపైకి వచ్చింది. పార్టీలో చేరే ముందు ఆయనకు హామీ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వివేక్ కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి ఎంపీగా, వివేక్ సోదరుడు గడ్డం వినోద్ సైతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్‌రావు పేరు కూడా వినిపిస్తోంది. వివేక్ లేదా ప్రేమసాగర్‌రావులలో ఒకరికి మంత్రివర్గంలో అవకాశం ఉండవచ్చు.