జూన్ 21న సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీలో ( Cabinet Meeting ) రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారుచేసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపైనా చర్చించే అవకాశం ఉంది.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, రైతులకు చెల్లింపులు, ఖరీఫ్ పంటల సాగు, పెట్టుబడి నిధుల అంశంపై కూడా కేబినెట్ సమీక్షించనున్నట్టుగా తెలుస్తోంది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు, ప్రాసెసింగ్, నష్టం తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్‌లో చర్చ జరుగనున్నట్టుగా తెలిసింది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులకు అవగాహన కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది.