REVANTH: మోదీ, కేసీఆర్‌లకు రేవంత్ సవాల్‌

రుణమాఫీపై చర్చకు రావాలని సవాల్‌... మంచి పాలన చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెడ్తారా అని ప్రశ్న;

Update: 2024-12-01 02:30 GMT

తెలంగాణలో రుణమాఫీపై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. ప్రతిపక్షాల నుంచి ఎవరొచ్చినా చర్చిస్తామని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్, మోదీ చర్చకు రావాలన్నారు. ‘‘ప్రధాని మోదీ వస్తారో.. మాజీ సీఎం కేసీఆర్‌ వస్తారో.. ఒక్కొక్కరుగా వస్తారో, అందరూ కలసి వస్తారో... రండి... చర్చిద్దాం..’’ అని సవాల్‌ చేశారు. దేశంలో రైతులకు భారీగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వెల్లడించారు. మంచి పాలన చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం కుప్పకూలిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం అంటేనే కాంగ్రెస్‌ పార్టీకి పేటెంట్‌ అని...వైఎస్సార్‌ హయాంలో ఉచిత విద్యుత్‌ నుంచి ఇప్పుడు వరి ధాన్యానికి రూ.500 బోనస్‌ దాకా ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌లో రైతు పండుగ అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శనలు, స్టాళ్లను తిలకించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు.

పాలమూరు ప్రజల కష్టాలు తీరలేదు

పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు మాత్రం తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఏం చేసిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని సీఎం వ్యాఖ్యానించారు. వెనుకబడిన మహబూబ్‌నగర్‌ జిల్లాను అభివృద్ధి చేస్తామంటే, అడుగడుగునా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్‌కు నిద్ర పట్టట్లేదు

రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఉందా అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. వరి వేస్తే ఉరి కేసీఆర్‌ అన్నాడని.. ఇప్పుడూ వరి వేస్తే ఇప్పుడు బోనస్ ఇస్తున్నామన్నారు. వరి వేస్తే బోనస్ ఇస్తుంటే.. మూడు రోజుల్లో డబ్బులు పడుతుంటే బీఆర్‌ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నాయన్నారు. ఐదేళ్లలో మొదటి ఏడాదిలో మాఫీ చేయకపోవడంతో మీరు చేసిన మాఫీ వడ్డీకే మిగిలిందని విమర్శించారు. ఒక్క రోజే 18 వేల కోట్లు రైతులకు మాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కాళేశ్వరం కడిగితే లక్ష 20 వేల కోట్లు పెట్టారని.. కాళేశ్వరం కుప్పకూలిందని సీఎం విమర్శించారు. మేము కట్టిన నాగార్జున సాగర్.. ఎల్లంపల్లి ఎట్లా ఉన్నాయి చూడాలన్నారు.

Tags:    

Similar News