REVANTH: రైతులకు భూములను దూరం చేసిన ధరణి
విపక్ష పార్టీది అహంకారం.. శాసనసభలో మండిపడ్డ ముఖ్యమంత్రి;
బీఅర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన 'ధరణి' పోర్టల్ అన్నదాతలకు భూములను దూరం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విపక్ష పార్టీ అహంకారంతో వ్యవహరిస్తోందని శాసనసభలో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా మర్యాదలను ఉల్లంఘించి గందరగోళం సృష్టిస్తున్నారని.. సభాపతిపైనే దాడి చేసే ధోరణిలో చర్చను అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని.. ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి అని చెప్పారు. అర్హులైన ప్రతీ భూ యజమానులు హక్కులు కాపాడేందుకు చట్టాన్ని సభలో ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చర్చ జరగడం ద్వారా తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావలని భావించామన్నారు.
ప్రతిపక్షానిది అహంకారం
ప్రతిపక్ష పార్టీ అహంభావం, అహంకారంతో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రావి నారాయణ రెడ్డి, అరుట్ల కమలాదేవి, అరుట్ల రాంచంద్రా రెడ్డి, మల్లు స్వరాజ్యం, భీం రెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ లాంటి వారు పోరాటాలు చేసింది భూమి కోసమేనని అన్నారు. ఈ భూమినే తమ హక్కుగా భావించి సాయుధ రైతాంగ పోరాటం చేశారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అధికారంతో, అహంకారంతో ఆధిపత్యాన్ని చెలాయించాలని చూసినా భూమిని కాపాడుకోవడంలో వారు విజయం సాధించారని అన్నారు. యజమాని హక్కులను కాపాడేందుకు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయన్నారు. భూమిలేని పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చి ఇందిరాగాంధీ గారు పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని గుర్తు చేశారు.
భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం
నిజమైన భూ యజమాని హక్కులను కాపాడాలని... లేకపోతే చదువులేని వారి భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు వీలైనంత మేరకు ప్రజలకు ఉపయోగపడేలా చట్టాలు సవరించాయన్నారు. తన మెదడును రంగరించి మాజీ సీఎం కేసీఆర్ ఒక అద్భుత చట్టాన్ని తీసుకొస్తున్నామని ఆనాడు సభలో చెప్పారన్నారు. ధరణి పోర్టల్ కేసీఆర్ సొంతంగా కనిపెట్టింది కాదు. 2010లోనే ఒడిస్సాలో ఈ-ధరణి పేరుతో IL&FS కంపెనీకి అప్పగించింది. అనుభవం, నైపుణ్యం లేని సంస్థకు ఈ-ధరణి పోర్టల్ ఇవ్వడాన్ని 2014లో కాగ్ తప్పుపట్టిందని రేవంత్ ఆరోపించారు.