Telangana : తెలంగాణలో మొదలైన ప్రలోభాల పర్వం..
ప్రచారం పూర్తయిన చోట ప్రలోభం మొదలయ్యింది;
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు డూ ఆర్ డై అన్నట్టే ఉన్నాయి. ఎలెక్షన్ల దెబ్బకి ప్రలోభాలపర్వం తారాస్థాయికి చేరుకుంది. స్థానిక నాయకులు, చోటామోట లీడర్లు.. ఇదే అదనుగా రంగంలోకి దిగారు. కులం, మతం, కాలనీ సంఘాల పేరిట బేరమాడుతున్నారు. అభ్యర్థుల నుంచి ఓటుకు 2000 నుంచి 5000 వరకు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, అంబర్‌పేట్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, మహేశ్వరం, చేవేళ్లలో ఓట్ల బేరాలు భారీఎత్తున సాగుతున్నట్టు సమాచారం. మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారాస కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ రెండు పార్టీల శ్రేణులు గొడవకు దిగారు. కూకట్‌పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని సమాచారంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని వారి నుంచి 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. పార్టీలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కోటి 60 లక్షల నగదు పోలీసులు సీజ్ చేశారు. ఖాజాగుడాలో పోలీసుల తనిఖీలు చేస్తున్న సమయంలో రెండు కార్లులో నగదును తరలిస్తున్న వ్యక్తులను గుర్తించారు. జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి కోసం తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
పరిగి నియోజకవర్గం పూడూరు మండలం చీలాపూర్ గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి... ఓటర్లకు వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేశారని సమాచారం. దేవుడి ఫోటోపై ప్రమాణం చేయించి డబ్బులిచ్చినట్లు ప్రత్యర్థులు వీడియో విడుదల చేశారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బెళ్తారొడ చెక్‌పోస్ట్ వద్ద ఓ వ్యక్తి నుంచి 500 రూపాయల నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐతే.. అవి చిన్న పిల్లలు ఆడుకునే నోట్లని గుర్తించారు. అతడు ఏ ఉద్దేశంతో నోట్లు తీసుకెళ్తున్నాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఓటర్లను మందు నిషాలో ముంచెత్తడానికి గ్రామాలకు మద్యం సీసాలు చేరుకుంటున్నాయి. సీసాలు ఎక్కడ నిల్వ ఉన్నాయనే లీకులు ప్రత్యర్థులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన బీఆర్‌ఎస్ అభ్యర్థులు అధిక శాతం స్థానిక సంస్థల ప్రతినిధుల వద్దకు లిక్కర్ సీసాలు చేర్చారని అంటున్నారు. కుల సంఘాల సభ్యులకు మద్యం చేరవేసి పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీగా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.