తెలంగాణలో మరో ఎన్నికల సమరం రాబోతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడువు ముగిసిన 125 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఇప్పటికే 117 మున్సాపాలిటీలు, 8 కార్పొరేషన్లకు సంబంధించిన ఓటురు జాబితా తయారీకి కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లాయి. ఓటరు జాబితాల సవరణ, ప్రచురణ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ వివరాలు ఈ నెల 10లోపు అందజేయాలని ఆదేశించారు. ఆ నివేదిక తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు ఫిబ్రవరితో ముగుస్తుంది. కాబట్టి వాటికి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ లోపు గడువు ముగిసిన వాటికి దశలవారీగా ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం 117 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల ఎన్నికలకు ప్రభుత్వం అన్నీ సిద్ధం చేస్తోంది. మొన్న పార్టీలు గుర్తులు లేని సర్పంచుల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించింది. కానీ అనుకున్నంత స్థాయి మెజార్టీ సీట్లు రాలేదు. కాబట్టి ఈసారి అలా కాకుండా బలమైన సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. దాదాపు అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతుల్లోనే ఉండాలని ఫిక్స్ అయింది. ఈ సారి మంత్రులను ఇన్ చార్జులుగా నియమించి మున్సిపాలిటీలు అప్పగించాలని చూస్తున్నారంట. అటు బీఆర్ ఎస్ కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు, మూడు ఉప ఎన్నికలు మాత్రమే పార్టీ గుర్తులతో జరిగాయి. ఇప్పుడే పూర్తి స్థాయిలో పార్టీ గుర్తున్న ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ సారి బలమైన సీట్లు సాధించి తెలంగాణలో తమ బలం పెరిగిందని నిరూపించుకోవాలని ట్రై చేస్తోందంట. అటు బీజేపీకి ఢిల్లీ అధిష్టానం నుంచి సీరియస్ ఆదేశాలు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు వచ్చాయని.. రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి రిజల్ట్ సాధించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. మరి ఏ పార్టీ ఏ స్థాయిలో రిజల్ట్ సాధిస్తుందో చూద్దాం.