Telangana: యూనివర్సిటీల సమస్యలపై స్పందించిన తెలంగాణ సర్కారు.. ఇకపై..
Telangana: తెలంగాణ యూనివర్సిటీల్లో తిష్టవేసి ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.;
Telangana: తెలంగాణ యూనివర్సిటీల్లో తిష్టవేసి ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. యూనివర్సిటీల్లో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ కోసం కామన్ బోర్డు ఏర్పాటు చేసింది. మెడికల్ యూనివర్సిటీలు మినహాయించి 15 యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీ కోసం తెలంగాణ సర్కారు ఈ బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు ఛైర్మన్‌గా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వ్యవహరించనుండగా.. కన్వీనర్‌గా కళాశాల విద్యాకమిషన్ మెంబర్ ఉండనున్నారు. అలాగే బోర్డు సభ్యులుగా విద్యాశాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులు బాధ్యతలు నిర్వహించనున్నారు.
తెలంగాణలోని అనేక యూనివర్సిటీల్లో టీచింగ్ స్టాఫ్ కొరత తీవ్రంగా ఉంది. అనేక సార్లువిద్యార్థులు దీనిపై వినతిపత్రాలు ఇచ్చినా పెద్దగా పురోగతి కనిపించలేదు. పలుమార్లు విద్యార్థులు ఆందోళనలు కూడా చేపట్టారు. అయితే ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు… ఎన్నడూ లేని రీతిలో ఉద్యమించడంతో… ఈ అంశం తాజాగా తెరపైకి వచ్చింది. మిగతా యూనివర్సిటీల స్టూడెంట్స్ సైతం ఇదే స్ఫూర్తితో పోరాటానికి సిద్ధమవుతున్న సంకేతాలు రావడంతో.. సర్కారు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఖాళీల భర్తీతో పాటు.. ఇతరత్రా సమస్యల పరిష్కారానికి సైతం ప్రణాళికలు రచిస్తోంది..