Telangana Liquor License: మందా..? మజాకా..? తెలంగాణ ఖజానాకు కాసుల గలగల.. మద్యం టెండర్లలో..!

Telangana Liquor License: తెలంగాణలో మద్యం టెండర్ల ప్రక్రియ పూర్తయింది.

Update: 2021-11-20 13:52 GMT

Telangana Liquor License: తెలంగాణలో మద్యం టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గతంలో ఎప్పుడూలేనంతగా ఖజానాకు కాసులు రాలాయి. రాష్ట్రంలోని 2 వేల 620 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా టెండర్లను కేటాయించారు. గతంలో కంటే షాపుల సంఖ్య పెరగడంతో 67 వేల 849 దరఖాస్తులు వచ్చాయి . గతంతో దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి 975 కోట్ల ఆదాయం రాగా, ఈసారి దాదాపు 400 కోట్లు ఎక్కువగా వచ్చింది అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య గణనీయంగా పెరగడంతో దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. . కాగా, షెడ్యూల్‌ ప్రకారం ఆయా జిల్లాల్లో కలెక్టర్లు.. మద్య దుకాణాలకు దరఖాస్తులకు డ్రా తీశారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని 65 మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం కలెక్టర్ హనుమంతు చేతుల మీదుగా డ్రా తీశారు. మొత్తం మద్యం దుకాణాలకు రికార్డు స్థాయిలో 2 వేల 983 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

జగిత్యాల జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపులో రభస జరిగింది. లిక్కర్ షాపులకు తక్కువగా దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రాను నిలిపేశారు అధికారులు. దీంతో దరఖాస్తు దారులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండల కేంద్రంలో గెజిట్ నెం. 43లో 6 దరఖాస్తులే వచ్చాయంటూ అధికారులు డ్రా నిలిపేశారు.

అయినప్పటికీ లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాల్సిందేనని ఆరుగురు దరఖాస్తుదారులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో డ్రా తీయాలంటూ కాసారపు రమేశ్ అనే దరఖాస్తు దారుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ వరి పొలాల్లోకి పరుగులు తీశాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులు, అధికారులు యువకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఇప్పటికే 18 లక్షలు పెట్టినా డ్రాలో ఒక్క షాపు కూడా తమకు రాలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తక్కువ టెండర్లు వచ్చాయనే కారణంగా అధికారులు డ్రా ఆపేసారని.. ఎక్కువ టెండర్లు వస్తే అందులో నుంచి మాకు డబ్బులేమైనా ఇస్తారా అంటూ నిలదీశాడు. అటు నిజామాబాద్ జిల్లాలో మద్యం దుకాణాలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు.

కలెక్టర్ నారాయణ రెడ్డి స్వయంగా విజేతలను ఎంపిక చేసి.. డ్రా విజేతలకు షాపులను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 102 మద్యం దుకాణాలకు పదహరు వందల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కొ దుకాణానికి 16 మంది పోటిపడ్డారు. అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన 3 షాపులకు డ్రా నిలిపివేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మద్యం దుకాణాలను లాటరీ పద్థతిని ఎంపిక చేశారు.

మొత్తంగా 336 మద్యం దుకాణాలకు.. 8 వేల 481 దరఖాస్తులు వచ్చి నట్లు అధికారులు వెల్లడించారు. వీటి ద్వారా ప్రభుత్వానికి 169 కోట్ల 62 లక్షల ఆదాయం వచ్చినట్లు స్పష్టం చేశారు. నల్లగొండలో 155 మద్యం దుకాణాలకు 4 వేల 79.. సూర్యాపేట జిల్లాలో 99 షాపులకు 3 వేల23 .. యాదాద్రిలో 82 షాపులకు పదమూడు వందల 79 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

నగరంలోని సరూర్ నగర్, శంషాబాద్లోని మద్యం దుకాణాలకు ఎల్బీనగర్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో డ్రా పద్దతిన మద్యం దుకాణాలను కేటాయించారు. సరూర్ నగర్లో 134 లిక్కర్ షాపులకు 4 వేల 2.. శంషాబాద్ లోని 100 మద్యం షాపులకు 4 వేల 122 దరఖాస్తులు వచ్చినట్లు అబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News