తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా జడ్పీటీసీ, జడ్పీ ఛైర్‌పర్సన్, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను ఈ నెల 23వ తేదీ నాటికి ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
త్వరలో జరగనున్న ఎన్నికలకు అన్ని జిల్లాల యంత్రాంగాలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. బీసీలకు కులగణన సర్వే ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ నిర్వహించాలని ఆదేశించారు.రిజర్వేషన్ల ఖరారు వివరాలను ముందుగా బయటికి వెల్లడించవద్దని, ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకుని జీవో జారీ చేసిన తర్వాతే వాటిని ప్రకటించాలని స్పష్టం చేశారు.