మున్సిపల్ ఎన్నికలు.. మూడు పార్టీలకు సవాల్..!

Update: 2026-01-07 08:45 GMT

పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల మీదనే తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీల దృష్టి పడింది. గడువు ముగిసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెలాఖరు వరకు నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు పట్టణాలపై దృష్టి పెడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఎన్నికలు ప్రధానంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ దాదాపు అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండేళ్లుగా సీఎంగా, మున్సిపల్ మంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి ఇప్పుడు తాను కూడా అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నారంట.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులతో జరుగుతున్న అతిపెద్ద ఎన్నికలు ఇవే. ఉప ఎన్నికల్లో పార్టీ గుర్తుపై గెలిచిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో కూడా బలమైన సీట్లు సాధించాలని దృష్టిపెడుతోంది. పంచాయతీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేశారు. అది మంచి ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు మరోసారి జిల్లాల పర్యటన చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అటు కేటీఆర్ కూడా జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులతో పాటు ఇప్పుడు ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఈ ఎన్నికల్లో అత్యధిక మునిసిపాలిటీలు గెలవాలని వ్యూహంగా పెట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాలేవు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఆ స్థాయి రిజల్ట్ సాధించి తమ పార్టీకి బలమైన పట్టు పెంచుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారు అంట.

పైగా ఈ మున్సిపల్ ఎన్నికల బాధ్యత మొత్తం కేటీఆర్ మీదే ఉందని సమాచారం. కాబట్టి ఈ ఎన్నికలు కేటీఆర్ నాయకత్వానికి సవాల్ విసురుతున్నాయి. అటు బిజెపి కూడా పట్టణాల్లో తమకు తిరుగులేదని కచ్చితంగా అత్యధిక మునిసిపాలిటీలు గెలుస్తామని చెబుతోంది. జనగామలో రోడ్ షో ద్వారా బలమైన సంకేతాలు ఇస్తోంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి అత్యధిక సీట్లు వస్తే ఆ పార్టీకి పట్టణాల్లో బలమైన పట్టు ఉన్నట్టు తేలిపోతుంది. మరి రేవంత్ రెడ్డి మార్క్ ఈ ఎన్నికల్లో కూడా వర్కౌట్ అవుతుందా.. కేటీఆర్ ఈసారి ఆదిపత్యం చెలాయిస్తారా.. బిజెపి సత్తా చాటుతున్న అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News