టీజీఎస్ ఆర్టీసీలో అనతికాలంలో 1000 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు అర్డర్ చేసినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈక్రమంలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయని, రాష్ట్రంలో పలు ప్రాం తాలలో 13 చార్జింగ్ స్టేషన్లను, ఎలక్ట్రిక్ బస్సులను సీఎం ప్రారంభించనున్నారని అధికారులు చెప్పారు.
మొత్తం వెయ్యి బస్సులలో 500 ఎలక్ట్రిక్ బస్సు లు హైదరాబాద్ లో తిరగనున్నాయని, మిగిలిన 500 బస్సులు సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అధిక ట్రాఫిక్ రూట్లలో నడుపనున్నట్లు వివరించారు. నగరంలోని హెచ్సీయూ, హయత్ నగర్ వంటి డిపోలలోని డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వాటిని గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నామన్నారు.
ఎంజీబీఎస్, జేబీఎస్, హెచ్సీయూ, హయత్నగర్-2, రాణిగంజ్, కూకట్పల్లి, బీహెచ్ ఈఎల్, హైదరాబాద్-2, వరం గల్, సూర్యాపేట, కరీంనగర్-2, నిజామాబాద్ సహా పలు డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. ఒక్కో స్టేషన్లో 20 నుంచి 25 ఛార్జింగ్ గన్లు ఉంటాయని, ఒకటి కంటే ఎక్కువ బస్సులు ఒకే సమయంలో ఛార్జ్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు.