Telangana Jobs: తెలంగాణలో పండగ వాతావరణం.. ఉద్యోగాల నోటిఫికేషన్లతో..

Telangana Jobs: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు సీఎం కేసీఆర్‌.;

Update: 2022-03-09 14:04 GMT

Telangana Jobs: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు సీఎం కేసీఆర్‌. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్‌ ‌ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91 వేల 142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80 వేల 39 ఉద్యోగాలకు ఇవాళ నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవాల్టి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం కేసీఆర్‌. మిగిలిన 11 వేల 103 ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు.

అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు సీఎం కేసీఆర్‌. 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రంలో 11వేల 103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్‌.

భవిష్యత్‌లో కాంట్రాక్ట్ పద్ధతితో నియామకాలు ఉండవని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ పరిమితి పదేళ్లు పెంచాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా.. ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి ఓసీ అభ్యర్థులకు 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా నిర్ణయించారు. దివ్యాంగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 54 ఏళ్లకు పెంచినట్లు వివరించారు. జోన్ల వారిగా ఉద్యోగాల భర్తి వివరాలు అసెంబ్లీలో వెల్లడించారు సీఎం కేసీఆర్‌.

జిల్లాలు, జోన్‌, మల్టీజోన్‌ల్లో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. హోంశాఖలో 18,334 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 13,086, వైద్యారోగ్య- కుటుంబ సంక్షేమ శాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, బీసీ సంక్షేమశాఖలో 4,311 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తానికి ఇన్నాళ్లు నీళ్లు, నిధులపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు నియామకాలపైన దృష్టి పెట్టడంతో.. తెలంగాణ లక్ష్యాలు నెరవేరుతున్నాయంటున్నారు గులాబీనేతలు.

Tags:    

Similar News