తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగిసింది. రెండు రోజులపాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ప్రోగ్రాంలో వందలాదిమంది అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు, టెక్ దిగ్గజాలు, సెలబ్రిటీలు, క్రీడా స్టార్లు, ఇతర పొలిటికల్ స్టార్లు పాల్గొన్నారు. అయితే రేవంత్ రెడ్డి ముందు నుంచి చెబుతున్న ఫ్యూచర్ సిటీకి ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెద్ద లక్ష్యం ఏర్పడినట్టు తెలుస్తోంది. రెండో రోజు కూడా భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఫార్మా కంపెనీలు, టెక్ కంపెనీలు, వస్తువుల తయారీ ఫ్యాక్టరీలు, సినిమా స్టూడియోలు, స్పోర్ట్స్ అకాడమీలు, ఇతర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మీద మొత్తం కలిపి 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటన్నింటికీ సంబంధించి ఎంఓయూలు కూడా కుదుర్చుకుంది రేవంత్ ప్రభుత్వం. ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసి పరిధి ఉంటుందని.. ఆ తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధి ఉంటుందని ఇప్పటికే చెప్పారు.
ఈ ఫ్యూచర్ సిటీ మొత్తం రీజినల్ రింగ్ రోడ్డుకు ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్యలోనే ఉంటుంది. ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసిన చోట విశాలంగా భూములు ఉన్నాయి. భారీగా ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయి కాబట్టి కరెంట్ కు ఎలాంటి లోటు లేదు. నీటి సౌకర్యానికి కూడా ఇబ్బందులు లేవు. ప్రకృతి విపత్తులు ఇప్పటివరకు అక్కడ నమోదు కాలేదు. కాబట్టి చాలా సేఫ్ ప్రాంతంలోనే ఈ ఫ్యూచర్ సిటీ రాబోతోంది. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం ఆ సమయానికి ఫ్యూచర్ సిటీ మరో హైటెక్ సిటీ లాగా మారాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఏ ప్రాజెక్టు అయినా పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి ఫ్యూచర్ సిటీ సమయం 2047. ఇప్పుడు హైదరాబాదు లోపల ఉన్న కంపెనీలు చాలావరకు ఫ్యూచర్ సిటీలోకి వెళ్లే ఛాన్స్ ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ ఇకనుంచి గ్రేట్ గ్రేటర్ హైదరాబాద్ గా మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ లక్ష్యం ఇండియాలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారడం. అన్ని రకాల టెక్నాలజీ, వస్తువుల తయారీలో ఫ్యాక్టరీలు, ఇన్నోవేషన్స్ కు కేరాఫ్ అడ్రస్ కావడమే ఫ్యూచర్ సిటీ లక్ష్యం. ఇప్పుడు వస్తున్న పెట్టుబడులకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రావడం పక్కా అని ప్రభుత్వం చెబుతోంది. ఆ తర్వాత దాన్ని ఎవరు ఆపలేరని కూడా వివరిస్తుంది. మరి ఫ్యూచర్ సిటీ ఆ స్థాయి లక్ష్యాలను అందుకుంటుందా లేదా చూద్దాం.