ప్రగతి భవన్ దగ్గర భారీగా భద్రతా దళాలు మోహరించాయి.. బీజేపీ నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించే అవకాశం ఉందని సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ముందు అల్లర్లు సృస్టించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మంత్రి కేటీఆర్ స్వయంగా ఆరోపించారు. దీనిపై డీజీపీకి ఆయన లేఖ కూడా రాశారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని.. బీజేపీ నేతలు కుట్రలకు తెరతీశారంటూ ఆయన డీజేపీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అటు.. బీజేపీ కార్యాలయం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఆ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఉదయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే ఉన్నారు. ప్రగతి భవన్ దగ్గర.. బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించడంతో.. టెన్షన్ వాతావరణం ఉంది.
మరోవైపు హైదరాబాద్‌లో ఆదివారం కోటి రూపాయలకు పైగా హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న ఇన్నోవా కారుతోపాటు ఇద్దరిని అదుపులోకితీసుకున్నారు. ఈ హవాలా డబ్బు దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాస రావు కారులో తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. అయితే ఇదంతా అధికార టీఆర్‌ఎస్ కుట్ర అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.