TG: ప్రభుత్వ సూళ్లలో విద్యా వాలంటీర్ల నియామకం
త్వరలో 1500 మంది విద్యా వాలంటీర్ల నియామకం
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 1500 మంది విద్యా వాలంటీర్లను తాత్కాలికంగా నియమించాలని పేర్కొంది. ఈ క్రమంలో ఒక్కో విద్యా వాలంటీర్‌కు ప్రతి నెలా రూ. 16 వేలు వేతనం ఇవ్వనున్నారు. దీంతో ఏడాదికి సుమారు రూ.14 కోట్లు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది మిగులు ఉపాధ్యాయులు ఉండగా..అదే సమయంలో అయిదు జిల్లాల్లో టీచర్ల కొరత ఉందని, ఆయా జిల్లాల్లో 1,428 మంది విద్యా వాలంటీర్లు(అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు) అవసరమని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గద్వాల జిల్లాలో 244 మంది, నారాయణపేట 320, వికారాబాద్ 123, మేడ్చల్ 520, రంగారెడ్డి జిల్లాలో 221మంది చొప్పున మొత్తం 1,428 మంది విద్యా వాలంటీర్ల కొరత ఉందని అధికారులు తేల్చారు. ఇతర గ్రామీణ జిల్లాలతోపాటు ఏపీ నుంచి మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు కుటుంబాల వలస పెరుగుతుండటంతో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.