న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన భార్య..!
ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోన్న వెంకటేశ్వర్లుతో తేజస్వినికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది.;
తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట భార్య తన బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోన్న వెంకటేశ్వర్లుతో తేజస్వినికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాక్‌టౌన్ కాలనీలో కాపురం పెట్టారు. అయితే.. భార్యభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతుండడంతో చివరికి అది పోలీస్ స్టేషన్‌లో కేసుల వరకూ వెళ్లింది.
తేజస్విని తన భర్త వెంకటేశ్వర్లుపై వారం కిందట సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివాహం జరిగినప్పటి నుంచి తన భర్త తనను వేధింపులకు గురి చేస్తున్నాడని కేసు పెట్టింది. దీంతో.. ఆగ్రహించిన అతను.. భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తేజస్విని తన కుటుంబసభ్యులతో కలిసి రాక్ టౌన్ కాలనీలోని భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. సంసార జీవితం వద్దు.. సన్యాసం తీసుకుంటానంటూ తన భర్త వెంకటేశ్వర్లు బెదిరిస్తున్నాడని తేజస్విని చెబుతోంది. కాంప్రమైజ్ అవుదామని చెప్పి మొహం చాటేశాడని అంటోంది.