సినీ పరిశ్రమకు అండగా ఉంటామంటూనే ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదన్నారు. హీరోల ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుందని, సొసైటీకి ఆదర్శంగా వారి ప్రవర్తన ఉండాలని సూచించారు. ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత అల్లు అరవింద్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సంధ్య థియేటర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు.
సినీ ప్రముఖులతో భేటీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. ఈ భేటీకి మంత్రులు, హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, చిక్కడపల్లి సీఐతో పాటు సినీ పరిశ్రమ నుంచి 46 మంది హాజరయ్యారు.
సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.