తెలంగాణ ప్రభుత్వం పర్యటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రచారం కోసం చిత్రీకరించిన వీడియోలో మండల కేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానిసహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు, కాకతీయులు నిర్మించిన గణపసముద్రం సరస్సు మత్తడికి చోటు దక్కింది. ప్రభుత్వం మొదటిసారి పర్యాటక అందాలు, వారసత్వ కట్టడాలుగా పేరొందిన కాకతీయుల గణపురం కోటగుళ్లు, గణప సముద్రాలకు సముచిత స్థానం కల్పించింది. రామప్ప దేవాలయం, భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట ఆలయం, పాండవుల గుట్ట, నాగార్జునసాగర్, జోడేఘాట్ లోయ, నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్షురి, ప్రాజెక్టు కొమురం భీంప్రాజెక్టు, ఎస్సారెస్పీ (నందిపే), బ్యాక్ వాటర్స్ తెలంగాణ అవేట్స్యు వీడియో చిత్రంలో ఉండగా రాష్ట్రంలోని ముఖ్య పర్యటక ప్రాంతాల సరసన గణపురం కోటగుళ్లు (గణపేశ్వరాలయ సముదాయం), గణప సముద్రాలకు వీడియో చిత్రంలో అవకాశం కల్పించారు. సుమారు నిమిషం నిడివి గల పర్యాటకశాఖ ప్రచార వీడియోలో నిలిపి వాటి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. పర్యటకశాఖ వెబ్ సైట్ లో పొందుపరిచారు. గత 18 సంవత్సరాలుగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ కొనసాగుతుండగా ఎట్టకేలకు పర్యాటక పటంలో చోటు దక్కడం పట్ల గ్రామస్తులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.