రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ అంశంలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు 10 మంది సమర్థులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. జూబ్లీహిల్స్ లోనూ కాంగ్రెస్ దే గెలుపని సర్వేల్లో తేలిందన్నారు. అసెంబ్లీ స్థానాలతో పాటు మహిళల సీట్లు పెరుగుతాయని చెప్పారు.
మంత్రి పదవుల అంశం తన పరిధిలో లేదని.. అది హైకమాండ్ చూసుకుంటుందని మహేశ్ గౌడ్ చెప్పారు. రాజకీయాల్లో ఒక్కో సారి జూనియర్ లకు ముందుగా.. సీనియర్లకు తర్వాత అవకాశాలు వస్తాయన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా పదవులు దక్కుతాయని తెలిపారు. ఇక అనిరుద్ రెడ్డి అంశంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి విచారణ చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుల గణన పత్రాలు తగులబెట్టడంతో చర్యలు తీసుకోవడం జరిగిందని.. తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ వేరు.. అనిరుధ్ అంశం వేరు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని.. అందుకే నిరసనలు చేస్తున్నారని తెలిపారు. మిగితా పార్టీల్లో నాయకులకు ఎటువంటి స్వేచ్ఛ ఉండదన్నారు.