టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నిరసనలు
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో బీజేపీ కార్యకర్తలు నల్లరిబ్బన్లు నోటికి కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.;
అయోధ్య రామమందిర నిర్మాణం నిధుల సేకరణపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిచేసిన వ్యాఖ్యలకు నిరసనలు వెల్లువెత్తాయి. పలు జిల్లాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. రాముడి విగ్రహంతో రామాలయాల వరకు ర్యాలీతీశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో బీజేపీ నాయకులు రామాలయం నుంచి బస్టాండ్ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖమ్మంలోను బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఖమ్మం కలెక్టరెట్ ముట్టడికి బీజేపీ నాయకులు ప్రత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టుచేశారు. రామాలయం నిర్మాణం కోసం దాతలు అనేకమంది ముందుకువచ్చి విరాళాలు ఇస్తుంటే.. టీఆర్‌ఎస్ నాయకులు ఓటుబ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో బీజేపీ కార్యకర్తలు నల్లరిబ్బన్లు నోటికి కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రామమందిర నిర్మాణం నిధి సేకరణపై తప్పుడు ప్రచారం చేసిన టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొత్తగూడెం పట్టణంలోని ఓల్డ్ బస్ డిపోనుంచి అమరవీరు స్థూపం వరకు నిరసన తెలిపారు.
కరీంనగర్ జిల్లాలోను నిరసనలు వెల్లవెత్తాయి. ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వేములవాడ పట్టణంలో బీజేపీ నాయకులు పెద్దయెత్తున నిరసన చేపట్టారు. రామాలయ నిధి సేకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడిచేసిన టీఆర్ఎస్ నాయకులను అరెస్టుచేయాలని వారు కోరారు.