తెలంగాణ సెక్రటేరియట్‌లో మళ్ళీ వాస్తు మార్పు ప్రచారం జోరందుకుంది. కొత్త నిర్మాణాలను ఇప్పటికే ప్రభుత్వం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మార్గ్ ఎంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ గేటు వరకు స్ట్రేట్‌గా కొత్త రోడ్డు నిర్మించనున్నారు. గేట్ నెంబర్ 3కి ఎదురుగా హుస్సేన్‌సాగర్ వైపు మరో కొత్త గేటును పెట్టనున్నారు. అలాగే కేసీఆర్ ఇష్టపడి కట్టించిన బాహుబలి గేట్లకు ఎదురుగా ఉన్న మెయిన్ గేటును పూర్తిగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. హుస్సేన్ సాగర్ గేటు నుంచి ఎంట్రీ ఇచ్చే గేటు 3 నుంచి ముఖ్యమంత్రి బయటకు వెళ్లేలా రూట్ మార్పు చేయనున్నారు. మరో రెండు మూడు రోజుల్లో గతంలో మూసిన ప్రధాన ద్వారాన్ని పూర్తిగా తొలగిస్తారని తెలుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం తేదీ నుంచే కొత్త గేటు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.