గురుకులాల్లో చదివిన వారు ప్రతిష్ఠాత్మక పదవులు చేపట్టారని సీఎం రేవంత్ అన్నారు. గురుకుల విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తామని చెప్పారు. చిలుకూరులో జరిగిన ‘గురుకులాల బాట’లో సీఎం మాట్లాడారు. ‘ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల కంటే గురుకుల విద్యార్థులు తక్కువనే అపోహ ఉంది. దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్లకు కామన్ డైట్ రూపొందించాం. గురుకులాలను ప్రక్షాళన చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. "ఫుడ్ పాయిజన్ జరిగి ఈ మధ్య ఒక బాలిక మరణించింది. ఆ బాలిక తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. శ్రీమంతుడుకి , పేదవాడికి వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుంది. మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది మన గౌరవ ప్రతిష్టలను పెంచేదా.. తగించేదా..?, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ నెలా 10వ తేదీలోగా గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు అందజేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పని రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రుసుం రూ.25 నుంచి రూ.75 కు పెంచి వారికి అప్పగించాం. వారంలో రెండు,మూడు రోజులు రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం." అని అన్నారు.