తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు మరోసారి హీట్ పుట్టిస్తోంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వేడి మరింత పెరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏం నిర్ణయం తీసుకుంటారు, కాంగ్రెస్ వ్యూహం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది "మేము బీఆర్ ఎస్ లోనే ఉన్నాం" అని అఫిడవిట్లు సమర్పించారు. తమ ప్రాథమిక సభ్యత్వం మారలేదని చెబుతున్నారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం ఇంకా అఫిడవిట్ దాఖలు చేయకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఇద్దరి నిర్ణయమే అందరికీ సస్పెన్స్ గా ఉంది. ఎనిమిది మంది “సింబాలిక్‌గా బీఆర్ ఎస్ లోనే ఉన్నాం” అని చెబుతున్నందున వారి కేసుల్లో స్పీకర్ ప్రత్యేకంగా విచారణ చేయవచ్చు. రాష్ట్రంలో సత్తా చాటాలంటే ఈ కేసుల్లో కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంకా ఏం స్పందించట్లేదు కాబట్టి వీరి స్థానాల్లో ఉప ఎన్నికలు రావొచ్చని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగతా ఎనిమిది మందికి పెద్దగా ప్రాధాన్యత కనిపించట్లేదు.
ఎక్కడైనా ఉప ఎన్నికలు వచ్చినా, కాంగ్రెస్ ఇప్పటికే గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలను అలర్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఫిరాయింపుల కేసులు అన్నీ ముగిసే వరకూ అంతర్గత విభేదాలు వెల్లువెత్తకుండా కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అవుతోంది. అవసరం అయితే కడియం, దానంలను ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల మీద పోటీ చేయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఈ ఇద్దరూ ఎలాంటి స్పందన ఇవ్వట్లేదని సమాచారం. మిగతా ఎనిమిది మందిని బీఆర్ ఎస్ దగ్గరికి రానివ్వట్లేదు. ఇటు కాంగ్రెస్ లో పెద్దగా కనిపించట్లేదు. వాళ్లంతా సైలెంట్ గా ఉంటూనే కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారని సమాచారం.