TG: తెలంగాణ సీఎస్‌గా ఎవరు వస్తారో..?
ఈ నెలాఖరుతో ముగియనున్న శాంతికుమారి పదవీకాలం.. వికాస్‌రాజ్‌వైపు కాస్త మొగ్గు..;
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికలో సమీకరణలు మారతున్నాయి. నిన్నటివరకూ వినిపించిన సీనియర్ ఐఏఎస్ అధికారి పేరు స్థానంలో మరో ఇద్దరి పేర్లు తెరమీదకు వచ్చాయి. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంలో సామాజిక సమీకరణలు, అధిక కాలం సర్వీసు అంశాలను కాంగ్రెస్ అధినాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో ఎవరు నియమితులు అవుతారానే ఉత్కంఠ కొనసాగుతోంది.
తెరపైకి మరో రెండు పేర్లు
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కే రామకృష్ణారావును నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే రామకృష్ణారావు సర్వీసు ఆగస్టు 2025 కు పూర్తవుతుంది. ప్రధాన కార్యదర్శిగా నియమించినా నాలుగు నెలలకు మించి కొనసాగే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ఒకరు జయేశ్ రంజన్. మరొకరు వికాస్ రాజ్. వీరిద్దరూ 1992 బ్యాచ్ అధికారులే కావడం గమనార్హం. జయేశ్ 2027 సెప్టెంబర్ నెలాఖరు వరకు సర్వీసులో ఉంటారు. వికాస్ రాజ్ 2028 మార్చి నెలాఖరుకు కొనసాగుతారు. జయేశ్... ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యునికేషన్ శాఖకు, వికాస్ రాజ్ ట్రాన్స్ పోర్ట్, రోడ్లు, భవనాల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందిన అధికారులే కావడం గమనార్హం. అయితే వీరిద్దరిలో వికాస్ రాజ్ వైపే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సమర్థ అధికారిగా పేరు ఉన్న వికాస్ రాజ్ కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. ఇటీవల వారం రోజుల పాటు శాంతి కుమారి సెలవుపై జపాన్ పర్యటనకు వెళితే.. వికాస్ రాజ్‌కే తాత్కాలిక బాధ్యతలు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.