Ramanujacharyulu: ఎవరీ రామానుజాచార్యులు.. ఆయన ఏం చేశారు?
Ramanujacharyulu:దేశ చరితను, మానవజాతి భవితను మలుపు తిప్పిన మహోన్నతుడు భువిపై అడుగుపెట్టిన పుణ్య ఘడియలవి.
Ramanujacharyulu: ఆయన.. అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగపరిచిన భగవదవతారం. మనుషులంతా సమానమని వెయ్యేళ్ల కిందటే చెప్పిన మహా మనిషి. విశిష్టాద్వైతాన్ని వ్యాప్తిలోకి తెచ్చి రూపాన్నిచ్చిన కారణజన్ముడు. 216 అడుగుల పంచలోహా విగ్రహాన్ని తయారుచేసి తమకు ఆయన పట్ల ఉన్న భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటోంది తెలుగు నేల. సమతా కేంద్రంలో రామానుజ సహస్రాబ్ది సమారోహాన్ని ఏర్పాటుచేశారు. మరో వెయ్యేళ్లయినా చెక్కుచెదరకుండా ఉండేలా రామానుజుని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నేటి తిరుమల వైభవము.. ఆనాటి రామానుజాచార్యుల కృషి ఫలితమే.
విశాల నేత్రాలతో కరుణ కురిపించే మహనీయుడు.. చిరు దరహాసంతో ప్రేమను చూపించే మహా మనిషి.. విశ్వమానవ తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సమతాస్ఫూర్తి. విశిష్టాద్వైతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన భగవదారాధకుడు. సమతాస్ఫూర్తికి ప్రతిరూపం. ఆధ్యాత్మిక వారసత్వానికి వారధి రామానుజాచార్యులవారు.
వెయ్యేళ్ల కిందటి కథ. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు అస్సలు లేవు. అలాంటి చోట నిమ్న వర్గాల వారికి భగవదానుగ్రహం కలగాలన్నా.. ఆచార్యుల ఆశీర్వాదం అందాలన్నా.. వారి కృపకు నోచుకోవాలన్నా చాలా కష్టంగా ఉండేది. వారి పరిస్థితి దయనీయంగా ఉండేది. ఎక్కడ కష్టమొచ్చినా.., ఎవరికి ఆపద వచ్చినా.. అక్కడ తానుంటానంటాడు నారాయణుడు. అందుకే సాక్షాత్తూ ఆ భగవంతుడి ఆశీస్సులను కలిగిన రామానుజాచార్యులవారు మానవతామూర్తిగా భువిపై జన్మించారు.
దేశ చరితను, మానవజాతి భవితను మలుపు తిప్పిన మహోన్నతుడు భువిపై అడుగుపెట్టిన పుణ్య ఘడియలవి. అలాంటి వెయ్యేళ్ల సమతాస్ఫూర్తికి ఇప్పుడు 'రామానుజ సహస్రాబ్ది సమారోహం' పేరుతో ఆధ్యాత్మిక వేడుకలు జరుగుతున్నాయి. శిల్పకళాశోభతో కళకళలాడుతున్న మండపాలు, ప్రాచీన శిల్పశైలిని ప్రతిబింబించే కళాకృతులు, దివ్య విమాన శిఖరాలు, ఎత్తయిన గోపురాలు.. ఒకటా రెండా ఎటు చూసినా భక్తిభావం అడుగడుగునా తొణికిసలాడే దివ్య ప్రాంగణం.
2014లో ప్రారంభమైన శ్రీమద్రామానుజాచార్య సమతామూర్తి స్ఫూర్తి నిర్మాణం పూర్తయ్యింది. 45 ఎకరాల విస్తీర్ణం.. పది శతాబ్దాలైనా చెక్కు చెదరకుండా ఉండేలా పటిష్టమైన విగ్రహ నిర్మాణం... చెప్పుకుంటూ పోతే ఇలాంటి విశేషాలెన్నో. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఎన్నో ఏళ్ల కల నేడు నిజమైంది.
ఇందులో 108 దివ్యదేశ దేవాలయాలను సర్వతోభద్ర మండలాకృతిలో రూపొందించారు. భద్రవేదిపై పద్మాసనంలో ఆసీనులై.. ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిచ్చే భగవద్రామానుజులవారి దివ్య ప్రతిమను దర్శించినవారి మనస్సు సంతోషంతో తన్మయత్వానికి లోనవుతుంది. ఇది పూర్వజన్మ సుకృతమే కదా అనిపిస్తుంది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలో శ్రీరామనగరంలోనే... శ్రీమద్రామానుజాచార్య సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం కొలువైంది. ఆధ్యాత్మిక విశేషాలతో ఉన్న ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి నిష్క్రమించేవరకు అడుగడుగునా కనిపించే శిల్పకళాసంపదను చూడడానికి రెండు కళ్లూ చాలవు.
విజయనగర నిర్మాణమైన రాతిరథాన్ని గుర్తుకు తెచ్చే రెండు శిలానిర్మిత రథాలను రెండు ఏనుగులు లాగుతున్న దృశ్యాన్ని చూసి మనసు అచ్చెరువొందుతుంది. గరుడ, హనుమ విగ్రహాలు ఇరువైపులా ఎత్తయిన మండపాల్లో కొలువుదీరిన దృశ్యం.. భక్తుల మనోఫలకాలపై చిరస్థాయిగా నిక్షిప్తమైపోతుంది. భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవం మీ కళ్లముందు కనిపిస్తుంది.
రామానుజుని విగ్రహం ఎత్తు మొత్తం 108 అడుగులు. ఇక పద్మపీఠం 27 అడుగులు, భద్రవేదిక 54 అడుగులు, త్రిదండం 135 అడుగుల ఎత్తు ఉన్నాయి. విగ్రహం చుట్టుకొలత 108 అడుగులు. కూర్చుని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహం ఇది. భద్రవేదికలో ఏర్పాటుచేసిన పద్మాలు 54, పద్మం కింద ఏర్పాటు చేసిన ఏనుగులు 36, శంఖచక్రాలు చెరి 18 ఉన్నాయి.
1800 టన్నుల పంచలోహాలతో తయారుచేసిన విగ్రహమిది. దీనిని చైనాలో విడిభాగాలుగా తయారుచేయించారు. ఇక్కడికి తెచ్చి విగ్రహంగా కూర్చారు. పండితుల సభలు నిర్వహించడానికి ఆడిటోరియం, ప్రదర్శనలకోసం ఓమ్నిమ్యాక్స్ థియేటర్ ఇలా ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. సెల్ఫ్ గైడెడ్ టూల్ సాయంతో ప్రత్యేక ఇయర్ ఫోన్ల ద్వారా సందర్శకులు తమకు నచ్చిన భాషలో ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకునే సదుపాయాన్ని ఏర్పాటుచేశారు.
విశిష్టాద్వైతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన... వ్యక్తికన్నా సమాజశ్రేయస్సే ముఖ్యమని చాటిన మానవతావాదికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?.. ఆయన ఆశయాలకు వారసులుగా నిలిచి.. వాటిని వ్యాప్తికి చిత్తశుద్ధితో కృషి చేయడం తప్ప. భగవంతుడి ఆరాధనకు కులమతాలు ప్రాతిపదిక కాదన్న సమతామూర్తికి శతకోటి వందనాలు.
రామానుజాచార్యులవారి విశ్వమానవ తత్వాన్ని ప్రపంచానికి చాటేలా ఏర్పాటుచేసిందే ఈ సమతా విగ్రహం. 108 దివ్యదేశాలు.. అంటే వైష్ణవక్షేత్రాల నడుమ కొలువుదీరిన ఈ విగ్రహ దర్శనం పూర్వజన్మ పుణ్యఫలమంటారు. 120 ఏళ్లు జీవించిన రామానుజాచార్యుల వారికి నివాళిగా 120 కిలోల బంగారంతో విగ్రహాన్ని తయారుచేశారు. ఐదడుగుల మూడంగుళాల విగ్రహాన్ని మూడడుగుల పీఠంపై అమర్చారు. నిత్యపూజలు అన్నీ ఈ విగ్రహానికే చేస్తారు.
ఓం నమో నారాయణాయ. నేడు ఇంటింటా పలుకుతున్న ఈ మంత్రం.. ఒకప్పుడు అత్యంత రహస్యం. గురువుగారి కరుణను పొందిన శిష్యులకు మాత్రమే ఈ తిరుమంత్రోపదేశం జరిగేది. అలాంటి మంత్రాన్ని రామానుజాచార్యులవారు ఎలా ప్రజలకు చేరువ చేశారు? దీనికి ఆయన చేసిన సాహసం ఏమిటి? తీసుకున్న నిర్ణయం ఎలాంటిది? అది ఇప్పుడు ఎలాంటి ఫలితాలను అందిస్తోంది?
పది శతాబ్దాల కిందటి పరిస్థితులను ఒకసారి అవలోకనం చేసుకుంటే.. అప్పట్లో శ్రీరామానుజాచార్యులవారు ఇద్దరు శిష్యులను వెంటబెట్టుకుని.. 150 మైళ్లు కాలినడకన వెళ్లాడు.మొత్తానికి హరినామస్మరణతో తిరుగోష్టియూర్ చేరుకున్నాడు. గోష్టీ పూర్ణులవారు అక్కడే ఉంటారని తెలిసి.. ఆయన నివాసానికి చేరుకున్నారు. తనను పరిచయం చేసుకుని.. శిష్యుడిగా స్వీకరించమని.. జ్ఞానభిక్ష పెట్టమని వేడుకున్నాడు. దానికి ఆ గురువుగారు.. ఓ నెలరోజులు ఉపవాసం చేసుకు రమ్మన్నారు. రామానుజాచార్యులవారు అలాగే చేశారు. తరువాత మళ్లీ అదే దృశ్యం. అలా రెండుసార్లూ మూడుసార్లూ కాదు, ఏకంగా పద్దెనిమిది సార్లు ఇలాగే చెప్పారు. అయినా ఆయన పట్టు వీడలేదు. చివరకు కాలంతోపాటు ఆ గురువు పెట్టిన పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు.
చివరకు గురువుగారి కరుణతో.. ఎంతో నిష్టతో అష్టాక్షరీ మంత్రోపదేశాన్ని పొందారు రామానుజాచార్యులు. కాని దానిని అయోగ్యులకు మాత్రం ఉపదేశించవద్దని షరతు పెట్టారు. దీంతో ఆ రహస్యాన్ని ఎప్పటికీ కాపడతానని మాటిచ్చాడు రామానుజులు. తిరుమంత్రంతోపాటు గురువు చెప్పిన బోధనలన్నింటినీ ఆకళింపు చేసుకుని తన స్వగ్రామానికి చేరుకుంటాడు.
శ్రీరంగం నుంచి 18 సార్లు వచ్చిన రామానుజులవారిని గురువుగారు కరుణించారన్న వార్త ఆ ఊరంతా తెలిసిపోయింది. ఆయనకు అష్టాక్షరీ చరమశ్లోక పరమార్థాలను బోధించారన్న సంగతి అందరికీ తెలిసింది. ఎందుకంటే 18 సార్లు ఆయన అంత దూరం నుంచి వస్తున్నారంటేనే.. రామానుజులవారి పట్టుదల ఎలాంటిదో వారికి అర్థమైంది. అందుకే వాళ్లంతా ప్రేమతో రామానుజుడిని ఓ మాట అడిగారు. మీరు గొప్ప భక్తులు కనుక ఇప్పటికైనా గురువుగారు కరుణించి మీకు ఆ మంత్రోపదేశం చేశారు. మరి తమలాంటి సామాన్య భక్తుల సంగతేంటి అని ప్రశ్నించారు. ఇది ఆ కారణజన్ముడి మదిలో పెద్ద అలజడినే సృష్టించింది.
పరమాత్ముడిని చేరుకునే మార్గం రహస్యంగా ఎందుకుండాలి అనుకున్నాడు. అందుకే ఆ జ్ఞానాన్ని అందరికి చేరేలా నిర్ణయం తీసుకున్నాడు. భగవంతుడు అందరివాడైతే.. ఆయన సాన్నిధ్యానికి చేర్చే తిరుమంత్రమూ అందరిదే అనుకున్నాడు. అందుకే ఊరివారందరిని పిలిచాడు. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరీ మంత్రాన్ని అందరితోనూ పలికించాడు. గురువుగారు ఉపదేశించి విశేషాలను వారికీ వివరించాడు. ఈ విషయం తెలుసుకున్న గురువుగారి ఆగ్రహం వ్యక్తం చేసినా.. రామానుజుడు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందారు.
రామానుజులవారు బయటకు చెప్పేవరకు ఆ తిరుమంత్రం నిజంగానే రహస్యం. గురువుగారి కృపకు నోచుకునేవారికి తప్ప వేరేవారి దరికి చేరేది కాదు. అలాంటిది కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత భేదాలేమీ లేకుండా ఇప్పుడు అందరికీ మేలు చేకూర్చేలా ఆ మంత్రం వినిపిస్తుంది. అందరి నోటిలోనూ పలుకుతోంది.
బ్రహ్మ సూత్రాలను అందరికీ అర్థమయ్యే రీతిలో శ్రీభాష్యాలుగా రచిస్తానని ముందే రామానుజులవారు చెప్పారు. ప్రజలను వేదపారాయణ చేసే ధర్మనిరతులుగా మారుస్తాననీ చెప్పారు. వ్యాస, పరాశరులు చెప్పిన తత్వ త్రయవైభవాన్ని లోకానికి వెల్లడిస్తాననీ ప్రకటించారు. ఇదంతా ఆయనను కలుసుకోవాలని అనుకున్నా కలవలేకపోయిన యామునాచార్యుల వారి పార్థివ దేహం దగ్గర చేసిన ప్రతిజ్ఞలే.
ముప్ఫై రెండో ఏట స్వీకరించిన సన్యాసాశ్రమంతో.. అనేకమంది గురువుల దగ్గర ఉపదేశాలు పొందే వీలు కలిగింది. తరువాత రామానుజుడు కాస్తా.. రామానుజాచార్యగా మారి పీఠాధిపతి అయ్యారు. ఆయన ప్రధాన శిష్యులే దాశరథి, కూరేశు. బోధాయన వృత్థి అనే గ్రంథాన్ని చదివి.. దాని ఆధారంగా శ్రీభాష్యం రచించారు. తన బోధనలతో ఎంతోమంది పండితులను కూడా సత్యంవైపు మళ్లించారు.
దక్షిణ భారతదేశంలో ఉన్న మూడు సిద్ధాంతాల్లో విశిష్టాద్వైతం ఒకటి. దీనినే వైష్ణవమనీ అంటారు. దీనికి ఎక్కువగా ఖ్యాతిని తీసుకువచ్చింది రామానుజులే. ఆదిశంకరుడు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతంలో కొన్ని మార్పులతో రామానుజులు రూపొందించిందే విశిష్టాద్వైతం.
తిరుమలలో కొలువైన వెంకటేశ్వరస్వామి కూడా శివుడి ప్రతిరూపం కాదని.. మహావిష్ణువు అవతారమేనని రామానుజులవారే నిరూపించారు. వాదప్రతిపాదాలతోనే అది శ్రీహరివాసంగా నిర్థారించారు. అయితే శైవులు.. ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారు. దీంతో రాత్రి సమయంలో విగ్రహం ఎదురుగా.. వైష్ణవ, శైవ ఆయుధాలను ఉంచారు. తెల్లవారేసరికి ఏ ఆయుధాలను స్వామివారు ధరిస్తారో చూద్దామని చెప్పారు. ఉదయాన్నే చూస్తే.. ధ్రువబేరానికి శంఖచక్రాలు ఆయుధాలుగా కనిపించాయి. అప్పటి నుంచి తిరుమలలో స్వామివారి అర్చనా, కైంకర్య విధానాలను ఒక పద్ధతిలోకి తెచ్చారు.
భక్తి మార్గాన్ని ప్రపంచమంతా చాటమని.. అది రామానుజ మార్గమై వర్ధిల్లుతుందని ఆరోజున ఆ గురువుగారు చెప్పిన మాట నిజమైంది. రామానుజులవారు గురువుగారి మాటను అక్షరాలా పాటించారు. అందుకే దేశమంతా ఇప్పుడు రామానుజ మార్గంలోనే నడుస్తోంది. అదే ఈ వెయ్యేళ్ల సమతా స్ఫూర్తికి ప్రతిరూపమై విరాజిల్లుతోంది.