ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ కార్డు చూపించాలని అడిగినందుకు ఆర్టీసీ కండక్టర్‌పై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక బస్సు కింద పడుకుని హల్‌చల్ చేయడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ వద్ద చోటుచేసుకుంది.
ఏం జరిగింది? లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్‌కు చెందిన బోయ చిట్టి (36) మద్యం తాగి కొత్తగూడెం బస్టాండ్‌లో ఖమ్మం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఉచిత బస్సు టికెట్ కావాలని కోరగా కండక్టర్ నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు చూపించాలని అడిగారు. దానికి ఆమె తన దగ్గర ఆధార్ లేదని చెప్పి, కండక్టర్‌తో వాదనకు దిగింది.
పరిస్థితి అదుపు తప్పడంతో, కండక్టర్ ఆమెను విద్యానగర్ వద్ద బస్సు నుంచి కిందికి దింపారు. దీంతో ఆ మహిళ మరింత ఆగ్రహం చెంది, బస్సు కింద పడుకుని నిరసన వ్యక్తం చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి, మందలించి వదిలిపెట్టినట్లు ఎస్సై తెలిపారు.