K Vishwanath: అస్తమించిన "కళాతపస్వి"... ప్రముఖుల నివాళి
తుదిశ్వాస విడిచిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ; ఉప రాష్ట్రపతి, సీఎం కేసీఆర్ నివాళి;
వెండితెరపై తెలుగుదనానికి కొత్త వన్నెలు అద్దిన కళాతపస్వి కె. విశ్వనాథ్ అస్తమించారు. తెలుగుతల్లికి కళానీరాజనం చేసిన దర్శకుడు, తరతరాలకూ తరిగిపోని కళా సంపదనిచ్చిన మహోన్నత కళాపిపాసి, అనువణువునా ఆధ్యాత్మికతను నింపుకున్న అలుపెరుగని బాటసారి నిండైన జీవితాన్ని ఆశ్వాదించి 92ఏళ్ల వయసులో తిరుగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా... భవిష్యత్తు తరాలు సైతం అపురూపంగా భావించే తరగిపోని కళాసంపదను వదిలివెళ్లారు. పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యుత్తమ పురస్కారాలు కైవసం చేసుకున్న కళాతపస్వికి మాజీ ఉప రాష్ట్రపతి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతి ముత్యం, స్వర్ణకమలం వంటి అద్భుత దృశ్యకావ్యాలను తీర్చిదిద్దిన విశ్వనాథ్ లేని లోటు ఎవరూ తీర్చలేనిదని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. సాధారణ కథలను సైతం అద్భుతమైన క్లాసిక్స్ గా మలచగలిగే ఏకైక దర్శకుడు ఆయన అని కొనియాడారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.