Maa association History : అలా మొదలైన 'మా' అసోసియేషన్.. ఇప్పటికి అదే మెయిన్ ఇష్యూ.. !

Maa association History : ఇప్పటివరకు 'మా' ఎన్నికలు' అంటే మాములుగానే జరిగాయి.. మా ఎన్నికలు అంటే కేవలం ఇండస్ట్రీకి మాత్రమే చెందినవి..

Update: 2021-10-06 12:02 GMT

Maa association History : ఇప్పటివరకు 'మా' ఎన్నికలు' అంటే మాములుగానే జరిగాయి.. మా ఎన్నికలు అంటే కేవలం ఇండస్ట్రీకి మాత్రమే చెందినవి... కానీ ఇప్పుడు ఏకంగా జనరల్ ఎలక్షన్‌‌ని తలపిస్తున్నాయి. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తగ్గేదే.. లే అన్నట్టుగా ఇద్దరూ వ్యవహరిస్తున్నారు. దీనితో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారాన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుండగా అసలు 'మా అసోసియేషన్' ఎప్పుడు మొదలైంది. దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటని తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.

ఓ మహోన్నత లక్ష్యంతో 26 ఏళ్ల క్రితం ఈ 'మా అసోసియేషన్' ఏర్పడింది. ఇండస్ట్రీలో ఉంటున్న నటీనటులు సమస్యలను పరిష్కరించడానికి, పేదకళాకారులకి అండగా నిలిచేందుకు, ఆర్టిస్టులకి అవకాశాలు కల్పించేందుకు 'మా' వేదికైంది. తెలుగు ఇండస్ట్రీ చాలావరకు హైదరాబాదుకి షిఫ్ట్ అయినప్పటికీ అసోసియేషన్ మాత్రం లేదు. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరి లాంటి వాళ్ళు సమాలోచనలు జరిపి ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికి మా అసోసియేషన్ అనే పేరు పెట్టారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవిని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి సీనియర్స్ ముఖ్యసలహాదారులుగా ఉన్నారు. దాదపు రెండేళ్ళ పాటు మురళీమోహన్ నివాసంలోనే కార్యకలాపాలు నిర్వహించారు. ఆ తర్వాత రామానాయుడు ఫిలింనగర్ లో నిర్మించిన సొసైటీ భవనంలో అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో లాంఛనంగా ప్రారంభించారు. రెండేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో చిరంజీవి తర్వాత మురళీమోహన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. దాదాపుగా ఆరు సార్లు ఆయనే ఎన్నికయ్యారు. ఆ తర్వాత మోహన్ బాబు, నాగార్జున, నాగబాబు తదితరులు కూడా అధ్యక్ష పదవిలో కొనసాగారు. అప్పటివరకు మా ఎన్నికలు అంటే ఏకగ్రీవంగానే జరిగేవి.. కానీ ఆ తరవాత తలెత్తిన విభేదాల నేపధ్యంలో పోటాపోటీ ఎన్నికలు మొదలయ్యాయి.

అలా జరిగిన ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, నరేష్ అధ్యక్షులుగా పనిచేశారు. రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని జయసుధని అభ్యర్ధిగా ప్రకటించడంతో అసోసియేషన్‌‌లో వర్గపోరు మొదలైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నరేష్, శివాజీరాజా పోటీపడగా సినీ పెద్దలు నరేష్‌‌కు నచ్చజెప్పి శివాజీరాజాని ఎన్నుకున్నారు. శివాజీరాజా హయంలోనే మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ఆయన అధ్యక్ష పదవి పూర్తి అయ్యాక 2019లో మా ఎన్నికలు జరిగాయి. ఆ సమయుంలో శివాజీరాజా పై సంచలన వ్యాఖ్యలు చేశారు నరేశ్. అతడు అక్రమాలకి పాల్పడ్డాడని నరేష్ ఆరోపించారు.

నాగబాబు, జీవితరాజశేఖర్‌‌ల సహాయంతో ఆ ఎన్నికల్లో నరేష్ గెలిచారు. ఇప్పుడు మళ్ళీ 'మా'కి ఎన్నికలు వచ్చాయి. మా అసోసియేషన్ మొదలైనప్పుడు అందులో 150 మంది సభ్యులుగా ఉండేవారు. ఇప్పుడు 850 మంది ఉన్నారు. పరభాష చిత్రాలలోని సభ్యుల కన్నా మాలో ఉన్న సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. అప్పుడు సభ్యత్వ రుసుము ఐదువేలు ఉండగా ఇప్పుడు లక్ష రూపాయలు ఉంది. అయితే ఇప్పటివరకు 'మా'కు సొంతభవనం అంటూ లేకపోవడం గమనార్హం. అదే ప్రధాన ఇష్యూగా ప్రతి ఎన్నికల్లో జరుగుతుంది.

Tags:    

Similar News