PROJECT K: అదిరిపోయిన దీపిక లుక్
హాలీవుడ్ రేంజ్‌లో దీపిక లుక్... ఫిదా అయిన అభిమానులు... రేపే ప్రభాస్ అభిమానులకు పండుగ...;
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్-కె’నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఫస్ట్‌లుక్ విడుదలైంది. హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న దీపిక ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీపిక తీక్షణమైన చూపుల.. ఏదో రహస్యాన్ని శోధిస్తున్నట్లుగా ఉన్నాయి. రేపటి కొత్త ప్రపంచం తాలూకు ఆశలను ఆమె కళ్లు ప్రతిఫలిస్తున్నాయంటూ ప్రాజెక్ట్ కే చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ దీపిక ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు క్యాప్షన్‌ను జత చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ (Project K). సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రకటన వెలువడిన క్షణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కోలీవుడ్ అగ్ర నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan), బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, దిశా పటానీ (Disha Patani) కీలక పాత్రలు పోషిస్తుండడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.
రానున్న మూడు రోజుల్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్‌ల ఫస్ట్ లుక్‌లు కూడా నిర్మాతలు విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఈ నెల 20న ప్రారంభం కానున్న ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకల్లో చిత్ర బృందం పాల్గొని అంతర్జాతీయ వేదికపై ప్రాజెక్ట్-K’ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఓ అనౌన్స్ మెంట్ పోస్టర్ విడుదల చేసింది. ఈ ప్రకటనతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఈ ప్రపంచం మొత్తం అత్యంత ఆసక్తికర షో కోసం వేచి చూస్తోందని.. ప్రాజెక్ట్-కె ప్రపంచాన్ని పరిచయం చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉండండడని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. జులై 20న అమెరికాలో జులై 21 ఇండియాలో ఈ ఆవిష్కరణ జరగనుంది. కామిక్ కాన్ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కె’ చరిత్ర సృష్టించనుంది.
వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్‌హీరో కథాంశంతో భారతీయ సినిమాలో మునుపెన్నడూ చూడనటువంటి విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారు.