Aryan Khan : ముంబైలో భారీ డ్రగ్స్ .. అదుపులోకి షారుఖ్ ఖాన్ కుమారుడు..!
Aryan Khan : ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. ముంబయి తీరంలోని కార్డెలియా క్రూయిజ్ నౌకపై....శనివారం రాత్రి NCB అధికారులు.. అకస్మిక సోదాలు సంచలనం సృష్టించింది.;
ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. ముంబయి తీరంలోని కార్డెలియా క్రూయిజ్ నౌకపై....శనివారం రాత్రి NCB అధికారులు.. అకస్మిక సోదాలు సంచలనం సృష్టించింది. ఈ క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతోన్న సమయంలో.. NCB సిబ్బంది అక్కడి వారిని అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్న వారిలో బాలీవుడ్‌లోని ఓ సూపర్ స్టార్ కుమారుడు ఉండటం విశేషం. వీరి వద్ద నుంచి కొకైన్, గంజాయి, MDMA వంటి మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు.
కార్డెలియా క్రూయిజ్ నౌకలో జరిపిన సోదాలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు ఎన్‌సీబీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్న వారిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తోపాటు అర్బాజ్ మర్చంట్, దమేచాను, నుపుర్ సారికా, ఇస్మీత్ సింగ్ ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు మోహక్ జైస్వాల్, విక్రాంత్ ఛోకేర్, గోమిత్ చోప్రా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్న వారిని, అక్కడి సామగ్రిని ముంబయికి తరలించాయి NCB బృందాలు.
మరోవైపు సముద్రతీరంలోని కార్డెలియా క్రూయిజ్ నౌకలో ఈ పార్టీని దిల్లీకి చెందిన ఓ కంపెనీతోపాటు, ఫ్యాషన్ టీవీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు ఈ పార్టీ జరగాల్సి ఉంది. కేవలం 100 టికెట్లను మాత్రమే విక్రయానికి ఉంచారు. మిగిలినవి నిర్వాహకులు నేరుగా విక్రయించారు. ఈ పార్టీకి సంపన్నులు ఎగబడ్డట్లు తెలుస్తోంది. దీంతో టికెట్లు కొనుగోలు చేసిన చాలా మంది నౌకలోకి వెళ్లలేకపోయినట్లు సమాచారం. షిప్ నిండిపోయిందని కారణం చెప్పి..వేల రూపాయలు చెల్లించిన యువతిని నిర్వాహకులు.. లోనికి అనుమతించ లేదంటే..అక్కడి పరిస్థితి అర్థమవుతోంది.
క్రూయిజ్ నౌకలో వ్యవహారాలను తేల్చేందుకు పక్కాప్రణాళికతో సిద్ధమైన మాదకద్రవ్యాల నిరోధకశాఖ అధికారులు.. సివిల్ పౌరులవలే నౌకలోకి ఎక్కారు. నౌక ముంబయి తీరాన్ని వదిలి సముద్రం మధ్యలోకి చేరగానే పార్టీ మొదలైంది. దీంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమై పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. ఇప్పటి వరకు 13 మంది... అధికారుల అదుపులో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ, అధికారుల నుంచి ఎటువంటి ధ్రువీకరణ లభించలేదు. నౌక యాజమాన్యానికి కూడా అధికారులు నోటీసులు పంపినట్లు తెలిసింది. ఇప్పటికే నౌకలోని చాలా గదులను తనిఖీ చేసిన అధికారులు...మరికొన్నింటిలో సోదాలు చేయాల్సి ఉంది.
రేవ్‌పార్టీకి ఎంట్రెన్స్ రూపంలోనే భారీగా వసూళ్లకు దిగుతున్నారు. అంతేగాక పార్టీలో డ్రగ్స్‌తోపాటు లిక్కర్ వంటివాటిని అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని సేవించి డీహైడ్రెట్ అయ్యేవారి కోసం ఖరీదైన వాటర్ బాటిళ్లతోపాటు, స్పోర్ట్స్ డ్రింకులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 'చిల్‌రూమ్స్' పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు గదులను సైతం సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది. పార్టీల్లో ముఖ్యంగా ఎండీఎంఏ అనే సింథటిక్ డ్రగ్‌ను వినియోగిస్తిన్నట్లు తెలుస్తోంది. ఎండీఎంఏ ప్రభావం పెంచేందుకు మెంథాల్ ఇన్‌హీలర్లు, కెమికల్ లైట్లు, నియాన్ గ్లో స్టిక్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం..