Tiger : రైల్వే ట్రాక్ దాటుతుండగా కెమెరాలో చిక్కిన పెద్దపులి.. ఆసిఫాబాద్ లో అలజడి

Update: 2024-12-19 12:15 GMT

ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా సిర్పూర్ (టి) అటవీ రేంజ్ పరిధిలోని మాకోడి సరిహద్దుల్లో పెద్దపులి సంచారం అలజడి సృష్టించింది. గత నెలరోజులుగా కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో సంచరిస్తూ రైతులను, ప్రజలను హడలెత్తిస్తున్న ఈ పెద్దపులి మహారాష్ట్ర సరిహద్దు దాటి వెళ్లిందని అందరు ఊపిరి పీల్చుకున్నారు. తీరా బుధవారం మధ్యాహ్నం సిర్పూర్ టి మండలం మాకోడి గ్రామ సరిహద్దుల్లో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైల్వే స్టేషన్ సిబ్బంది సెల్ఫోన్లో వీడియో రికార్డు చేశారు. మూడు ట్రాక్లను దాటి మాకోడి వైపు పెద్దపులి వెళ్లడాన్ని ప్రజలు చూశారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మాకోడి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే రైల్వే స్టేషన్ పరిధిలో పెద్దపులి తారస పడటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కాగజ్నగర్ అటవీ శాఖకు చెందిన పది ట్రాక్ టీమ్లు పెద్దపులి కదలికలపై ఆరా తీస్తూ గాలింపు ముమ్మరం చేశారు. పంట చేలకు వెళ్లే రైతులు, సామాన్య ప్రజలను అధికారులు అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. 

Tags:    

Similar News