యూపీలోని బదాయూ జిల్లా సరాయ్ పిపరియా గ్రామంలో అద్భుతం జరిగింది. కొలను తవ్వుతుండగా పంచముఖి శివలింగం బయటపడింది. ఇది దాదాపు 300 ఏళ్ల పురాతనమైందని అధికారులు, పండితులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారికి తెలియడంతో పంచముఖి శివలింగాన్ని చూసేందుకు పోటెత్తారు. ఈ సమయంలో అక్కడే ఉన్న నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త, పర్యావరణవేత్త శిప్రా పాఠక్ కీలక విషయాలు చెప్పారు. తన 13 ఎకరాల స్థలంలో తామర కొలను ఏర్పాటుకు ఈ తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు. అయితే పంచముఖి శివలింగం బయటపడడం అద్బుత విషయమన్నారు.
ఈ స్థలంలోనే పంచతత్వ పౌధ్‌శాల పేరిట శిప్రా నర్సరీని నడుపుతున్నారు. తన ఫౌండేషన్ ద్వారా యేటా 5 లక్షల మొక్కల పంపిణీ లక్ష్యంగా పెట్టుకొన్నారు. అయితే శివలింగం బయటపడడాన్ని దేవుడి అనుగ్రహంగా చెబుతున్నారు.