singer to food stall owner: మహమ్మారి ఆమె జీవితాన్ని మార్చేసింది.. సింగర్ నుండి ఫుడ్ స్టాల్ ఓనర్ గా..
singer to food stall owner: అవసరం నుంచే ఆలోచనలు పుట్టుకొస్తాయి. స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు బీజం పడింది.;
Singer to food stall owner: కోవిడ్ కొందరి జీవితాల్లో వెలుగులు నింపితే.. చాలా మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఉన్న ఉపాధిని పోగొట్టుకున్న వారు కొందరైతే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని ఆదాయ మార్గాలను వెతుకున్నవారు మరికొంతమంది. చాలా మంది తమ అవసరాలను తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకున్నారు.
గుజరాత్ కు చెందిన ఓ మహిళ మహమ్మారి కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను అధిగమించింది. ఫుడ్ స్టాల్ పెట్టి రుచికరమైన ఫ్రాంకీలను అందిస్తోంది. గాయనిగా తన కెరీర్ బావుంది అనుకున్న సమయంలో కరోనా వచ్చి కష్టాలు తెచ్చింది. అవకాశాలు రాలేదు. ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి.
అవసరం నుంచే ఆలోచనలు పుట్టుకొస్తాయి. స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు బీజం పడింది. అదే తన ఆదాయ మార్గంగా మలచుకుంది.
ఫుడ్ బ్లాగర్ కరణ్ ఠక్కర్ అప్‌లోడ్ చేసిన వైరల్ వీడియోలో, ఫ్రాంకీ ఉమెన్ అని పిలువబడే యువతి జామ్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్ ఎదురుగా ఉన్న తన స్టాల్‌లో స్ట్రీట్ ఫుడ్ సిద్ధం చేస్తోంది.
కూరగాయలు కట్ చేయడం, వంట చేయడం వంటివి చేస్తూనే మధ్యలో తన కథను వివరిస్తుంది. "వృత్తి రీత్యా నేను గాయకురాలిని; మహమ్మారి కారణంగా, నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడానికి, నా బిడ్డను పెంచుకోవడానికి నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను.
స్ట్రీట్ ఫుడ్ బాగా నడుస్తుందని ఫ్రెండ్ చెప్పడంతో దానిపై దృష్టి సారించాను. పాట ఎంత ఇష్టమో, వంట చేయడం కూడా అంతే ఇష్టం. ఆ ఇష్టాన్నే ఆదాయ మార్గంగా మలచుకున్నాను. యువతీ యువకులు అత్యంత ఇష్టపడే ఫ్రాంకీని అందించే స్టాల్స్ జామ్‌నగర్‌లో ఎక్కువ లేనందున, నేను నా ఫుడ్ స్టాల్‌ని అక్కడే ప్రారంభించాను, "అని ఆమె చిరునవ్వుతో చెప్పింది.
పరిస్థితులు ఎంత కఠినంగా జీవితంపై ఆశను కోల్పోకూడదు అని ఫ్రాంకీ ఉమెన్ ని చూస్తే అర్ధమవుతుంది అని ఫుడ్ బ్లాగర్ తన ఇన్ స్టా పేజీలో రాసుకొచ్చింది. ఇతరులపై ఆధారపడకుండా, తమపై తాము నమ్మకం ఉంచి కష్టపడి పనిచేస్తే రిజల్ట్ కూడా అనుకూలంగా వస్తుంది అని తెలిపింది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు ఫ్రాంకీ మహిళ పట్ల సానుకూలగా స్పందిస్తున్నారు. ఆమె దృఢ నిశ్చయాన్ని కొనియాడుతున్నారు. మరికొందరు ఆమె స్టాల్‌ను సందర్శించిన మరొక వినియోగదారుడు ఆమె పాట అంత రుచిగా ఉంది ఆమె తయారు చేసిన ఫ్రాంకీ కూడా అని మెచ్చుకుంటున్నారు.