మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని రామిరెడ్డి లేఅవుట్ కు చెందిన బయారెడ్డి(22)డ్రైవర్. అలాగే కొండామర్రిపల్లెకు చెందిన భవిత(21)ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఈనేపథ్యంలో వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటూ వారంరోజుల కిందట కులాంతర వివాహం చేసుకున్నారు.అయితే అమ్మాయి తల్లిదండ్రులు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రేమజంటను స్టేషన్ కు రప్పించారు.ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు అమ్మాయిని వారి తల్లిదండ్రుల వెంట పంపించేశారు.దీన్ని జీర్ణించుకోలేని బయారెడ్డి మంగళవారం ఇంట్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు.కాగా కుటుంబీకులు బాధితుని మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రేమవివాహం చేసుకున్న జంటను పోలీసులు విడగొట్టి తనకు అన్యాయం చేశారంటూ బయారెడ్డి ఆరోపించాడు.భవిత తనకు దక్కకుంటే బతకలేనని,చావే శరణ్యమంటూ స్పష్టం చేశాడు.పోలీసులు తన బిడ్డకు అన్యాయం చేశారంటూ బయారెడ్డి తండ్రి కంటతడి పెట్టాడు.ఇద్దరూ మేజర్లు అయినప్పటికీ విడగొట్టి అన్యాయం చేశారని వాపోయాడు.ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఇద్దరినీ ఒక్కటి చేసి తన బిడ్డను బతికించాలంటూ బాధిత తండ్రి కొండారెడ్డి వేడుకున్నాడు.