Macedonia: ఉత్తర మాసిడోనియా నైట్ క్లబ్‌లో మంటలు.. 59 మంది మృతి
బాణసంచా పేల్చే పరికరాల్లో నిప్పురవ్వలు ఎగసిపడడంతో ప్రమాదం;
ఉత్తర మాసిడోనియాలోని కొకని పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ నైట్‌క్లబ్‌లో స్థానిక పాప్ బృందం కచేరీ నిర్వహిస్తుండగా బాణసంచా కారణంగా భవనంపై కప్పుకు మంటలు వ్యాపించాయి. దీంతో కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. అగ్ని ప్రమాదం వల్ల భవనం పైకప్పు పాక్షికంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 59 మంది దుర్మరణం చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు. వారిని వివిధ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన భవనం గతంలో కార్పెట్ గోదాముగా ఉండేదని స్థానిక మీడియా పేర్కొంది. నైట్‌క్లబ్‌కు లైసెన్స్ ఉందా? భద్రతా ప్రమాణాలను పాటించారా? అన్న విషయాలపై దర్యాప్తు చేస్తామని హోం శాఖ మంత్రి తొష్కోవ్‌స్కీ తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీ, ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.పర్యవసానాలను ఎదుర్కోవడానికి చేయాల్సిందంతా చేస్తామని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషాదానికి కారణాలను కనుక్కుంటున్నామని అన్నారు.''ఇది దేశానికి చాలా కష్టమైన, విషాదకరమైన రోజు. చాలా యువప్రాణాలను కోల్పోయాం'' అని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. కోకని ఆసుపత్రిలో తొలుత ఒళ్లంతా తీవ్రంగా కాలిపోయిన 90 మందిని చేర్చారు. గాయాల పాలైన మరికొంతమందిని చికిత్స కోసం స్కాప్యాలోని ఆసుపత్రులకు తరలించారు.