Drones: చైనా, పాక్ సరిహద్దుల్లో అత్యాధునిక హెరాన్ డ్రోన్ లు
అత్యాధునిక ఆయుధాలను సరిహద్దులకు తరలింపు;
పాకిస్థాన్, చైనాలతో సరిహద్దు పంచుకుంటున్న నేపథ్యంలో వారినుంచి ఎల్లప్పుడూ ముప్పు పొంచే ఉంటుంది. అందుకే భారత అమ్ముల పొదిలో అత్యాధునిక హెరాన్‌మార్క్ 2 డ్రోన్లను నార్తర్న్ సెక్టార్‌లో మన వాయుసేన మోహరించింది. ఒక్కసారి ఎగిరితే పాక్, చైనాతో మనకు ఉన్న సరిహద్దులను మొత్తం చుట్టిరాగల ఈ డ్రోన్లు చీమ చిటుక్కుమన్నా పట్టేస్తాయి.
పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు, చైనా నుంచి సైనికుల కవ్వింపులు సరిహద్దుల వెంబడి అలవాటుగా మారిన క్రమంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక హెరాన్ మార్క్ 2 డ్రోన్లను.. వాయుసేన నార్తర్న్ సెక్టార్‌లోని ఫార్వర్డ్ ఎయిర్‌బేస్‌లలో మోహరించింది. ఇజ్రాయెల్ నుంచి ఈ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయగా వీటి రాకతో భారత సరిహద్దులు మరింత దుర్బేధ్యంగా మారాయి. మొత్తం 4 డ్రోన్లను వాయుసేన ఫార్వర్డ్ బేస్‌కు తరలించింది.
హెరాన్ మార్క్ 2 డ్రోన్‌లను నేవీ, ఎయిర్ ఫోర్స్ విధుల కోసం ఇజ్రాయెల్ తయారు చేసింది. సరిహద్దుల వెంట గస్తీతో పాటు.. అవసరమైనప్పుడు శత్రువులపై దాడులను ఇవి చేయగలవు. దీర్ఘశ్రేణి క్షిపణులతో పాటు ఇతర ఆయుధ వ్యవస్థలను అమర్చే వీలు వీటిలో ఉంటుంది. బాంబులను కూడా జార విడిచే సామర్థ్యం ఈ డ్రోన్లలో ఉంది. ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ సహా 36 గంటల పాటు నిరంతరాయంగా ఎగిరినా ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సైన్యానికి ఈ డ్రోన్లు అందిస్తాయి.
హెరాన్ మార్క్ 2లో ఉన్న లేజర్ వ్యవస్థ.. శత్రులక్ష్యాలను గుర్తించి దీర్ఘశ్రేణి మిస్సైళ్లను ప్రయోగించేందుకు మన యుద్ధ విమానాలకు సాయమందిస్తాయి. 35 వేల అడుగుల ఎత్తులో 150 నాట్ల వేగంతా ఈ డ్రోన్లు ఎగురుతాయి. ఒక్కసారి ఎగిరితే పాక్, చైనా సరిహద్దు అంతటా గస్తీ నిర్వహించి తిరిగి రాగల సత్తా వీటి సొంతం. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు సున్నా డిగ్రీల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ డ్రోన్లు సేవలందించగలవని వాయుసేన తెలిపింది.
శనివారం జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ వైమానిక స్థావరంలో అప్‌డేట్ చేసిన మిగ్ 29 యుద్ధ విమానాలను వాయుసేన మోహరించింది. ఇక్కడ మిగ్-21 ఫైటర్లు ఇంతకాలం విధులు నిర్వహించగా.. ఇప్పుడు వాటి స్థానంలో మిగ్-29 విమానాలను దింపింది. దీంతో ఇప్పటికే శత్రు దుర్బేధ్యంగా తయారైన ఉత్తర సరిహద్దులు. ఈ డ్రోన్లతో మరింత పటిష్ఠం కానున్నాయి.