Trump : పగలు అందంగా మాట్లాడతాడు.. కానీ రాత్రైతే.. ఆ దేశాధ్యక్షుడిపై ట్రంప్..
గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తుంది. అయినా ఉక్రెయిన్ మాత్రం రష్యాకు లొంగడం లేదు. ఈ యుద్ధం ఆపుతానంటూ ట్రంప్ గతంలో ప్రకటించినా.. ఈ రెండు దేశాల అధినేతలు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఆయన పగలు చాలా అందంగా మాట్లాడతారని.. కానీ రాత్రైతే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారని విమర్శించారు. పుతిన్ దుర్మార్గపు ప్రవర్తన తమకు నచ్చట్లేదన్నారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా తిరస్కరించడంతో ట్రంప్ ఈ విమర్శలు చేశారు.
మరోవైపు మాస్కోపై కొత్త ఆంక్షలు విధించే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘రష్యాపై కొత్తగా, కఠినమైన ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. అతి త్వరలో దీనిపై స్పష్టత ఇస్తాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యాపై ఆంక్షలకు సంబంధించిన ఓ బిల్లును యూఎస్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రష్యాకు సాయం చేసే దేశాలపై 500శాతం టారిఫ్‌లు విధించేలా ఈ బిల్లును రూపొందించినట్లు సమాచారం.