ఇరాన్ మద్దతుతో హిజ్బుల్లా గ్రూప్ రెచ్చిపోయింది. గురువారం ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై 200కి పైగా రాకెట్లు ప్రయోగించినట్లు ప్రకటించింది. తమ సీనియర్ కమాండర్‌లలో ఒకరిని చంపినందుకు ప్రతీకార చర్యగా ఈ దాడులు చేసినట్లు హిజ్బుల్లా గ్రూప్ తెలిపింది. 2023 అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో గాజాలో యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా ఇరాన్‌కు సన్నిహితంగా ఉండే హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్‌పై దాడి చేస్తూనే ఉంది.
బుధవారం ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లోని టైర్ ప్రాంతంలో దాడి చేసి మొహమ్మద్ నమెహ్ నాజర్‌ను చంపాయి. దీనికి ప్రతిస్పందనగా హిజ్బుల్లా, లెబనాన్‌కు సరిహద్దు వెంబడి ఉన్న ఐదు ఇజ్రాయెల్ స్థావరాలపై 200 కంటే ఎక్కువ భారీ వార్‌హెడ్‌లతో విరుచుకుపడింది. ఫలక్ రాకెట్‌లు, కటియుషా రాకెట్‌లతో దాడిచేసింది. ఇరాన్‌కు మద్దతుగా హిజ్బుల్లా, ఇజ్రాయెల్‌పైకి చేసిన దాడి ఇటీవల కాలంలో బీభత్సమైనదని చెబుతున్నారు.
స్పందించిన ఇజ్రాయెల్, అనేక అనుమానాస్పద రాకెట్లు తమ భూభాగంలోకి ప్రవేశించాయని, వాటిలో చాలా వరకు అడ్డుకున్నామని తెలిపింది.