అమెరికా దేశం వాషింగ్టన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా ఓ ప్రయాణికుల విమానం, హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. ఆ రెండూ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం నిన్న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాన్సాన్ నుంచి వచ్చిన ప్రయాణికుల విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చింది.అదే సమయానికి ఓ మిలిటరీ హెలికాప్టర్ ఆ మార్గంలోకి వచ్చింది. ఆ తర్వాత కేవలం 30 సెకన్లలోపే ఆ రెండూ ఢీకొన్నట్లు శబ్దం వినిపించింది. రన్‌వేకు 2400 అడుగుల దూరంలో ప్రయాణికుల విమానం నుంచి రేడియో ట్రాన్స్‌పాండర్ డేటా ఆగిపోయింది. విమానం సరిగ్గా నది మధ్యలో ఉన్నప్పుడే సిగ్నల్స్ ఆగిపోయాయని తెలిసింది. ప్రమాదం కారణంగా విమానం ముక్కలై నదిలో పడిపోయింది. హెలికాప్టర్ కూడా తలకిందులుగా కూలింది. ఘటన సమయంలో విమానంలో 64 మంది, హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారు.