Khalistan: హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక ఐఎస్‌ఐ హస్తం?
భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినాలని పాకిస్తాన్ కుట్ర?;
భారతదేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా ఖలిస్తాన్ ఉగ్రసంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో రాడికల్ సిక్కులు భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. ఇతను కూడా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)పేరుతో ఉగ్రవాద సంస్థను నడుపుతున్నారు. కెనడాలో సర్రే ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇతడిని కాల్చి చంపారు. అయితే ఖలిస్తాన్ ఉగ్రసంస్థలకు, వేర్పాటువాదులకు పాకిస్తాన్ ఐఎస్ఐ సాయం చేస్తుందని ఎప్పటి నుంచో తెలుసు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య...భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ఆరోపించగా...ఆ వాదనను భారత్ తోసిపుచ్చింది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎప్పటి నుంచో అండగా ఉంటోంది. భారత్ వ్యతిరేక ప్రచారం కోసం వారిని వినియోగించుకుంటోంది. ఖలిస్తానీ ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తోంది. ఈ క్రమంలోనే రెండేళ్లుగా కొందరు గ్యాంగ్‌స్టర్లను పాకిస్తాన్.... కెనడాలో దించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ గ్యాంగ్‌స్టర్లకు మద్దతు ఇవ్వాలని నిజ్జర్‌పై పాకిస్తాన్ ఒత్తిడి తెచ్చినట్లు వివరించాయి. ఈ క్రమంలోనే నిజ్జర్‌తో వచ్చిన విభేదాల కారణంగా అతన్ని చంపేందుకు పాకిస్తాన్ కొందరు క్రిమినల్స్‌ను రంగంలోకి దించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నిజ్జర్‌ను హత్య చేసి ఆ నేరాన్ని భారత్‌పై నెట్టేందుకు పాకిస్తాన్ యత్నిస్తోందని తెలిపాయి. అంతేకాదు నిజ్జర్ స్థానంలో తమ మాట వినే మరో ఖలిస్తానీ నేతను పెట్టేలా పాక్ యత్నిస్తోందని వెల్లడించాయి. భారత్-కెనడా మధ్య విభేదాలు సృష్టించి తద్వారా తాము లభ్ది పొందాలని పాకిస్తాన్ యత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఖలిస్తానీ ఉగ్రసంస్థలకు నిషేధిత లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థతో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ) ఈ సంబంధాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఇవి యూరప్, కెనడాల్లో ఖలిస్తానీ ఉద్యమం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఎలా మూలాధారంగా మారాయనే దానిపై విచారణ మరింత లోతుగా సాగుతోంది.
నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్(బీకేఐ) యూరప్, ఉత్తర అమెరికాలో నివసిస్తున్న సిక్కుల నుంచి నిధులను అందుకుని వాటిని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తోంది. కెనడాల్లోని వివిధ నగరాల్లో సిక్కు ర్యాలీలు నిర్వహించి నిధుల సేకరిస్తోందని తేలింది. ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో బబ్బర ఖల్సాకు సంబంధాలు ఉన్నాయి. దీంతో పాటు లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహీదీన్ వంటి ఉగ్రసంస్థలతో బీకేఐ సంబంధాలు నెరుపుతోంది. బీకేఐ పాకిస్తాన్ తో పాటు అమెరికా, కెనడా, యూకే, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, నార్వే, స్విట్జర్లాండ్ లలో క్రియాశీలకంగా ఉంది. ఇది ప్రపంచ భద్రతకు ముప్పును కలిగిస్తోంది. పాక్ గూఢాచర సంస్థ ఐఎస్ఐ మద్దతుతో బీకేఐ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.