ఉత్తరకొరియాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులకు వరదలు రావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకు నేందుకు సహాయ సామగ్రిని అందజేస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది.
వాటిని ఎలా సరఫరా చేయాలన్న దానిపై చర్చించేందుకు తక్షణమే స్పందించాలని ఉత్తరకొరియా రెడ్ క్రాస్ సంస్థను కోరింది. అయితే, సియోల్ ఆఫర్ పై కిమ్ సర్కారు స్పందించక పోవడం గమనార్హం.
మరోవైపు వర్షాల కారణంగా ఉత్తరకొరియా వ్యాప్తంగా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించిన అధ్య క్షుడు కిమ్ జోంగ్ ఉన్.. స్వయంగా విపత్తు సహాయక చర్యల్లో భాగస్వామి అయ్యారు. రెస్క్యూ సిబ్బందితో పాటు బోటులో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్య టించి పరిస్థితిని అంచనా వేశారు.
వర్షాల కారణంగా బుధవారం నాటికి 4100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7,410 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. చైనా సమీపంలోని సినాయు, యిజు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ప్రాణ నష్టంపై కిమ్ సర్కారు ఇంకా ఎలాంటి వివ రాలు వెల్లడించలేదు.