Taliban News: తప్పు చేస్తే కాళ్లు, చేతులు నరికేస్తాం: తాలిబన్లు

ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని తాలిబన్లు ప్రజలను భయపెడుతున్నారు.

Update: 2021-09-25 07:00 GMT

Taliban News: ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే అరాచక పాలనకు ట్రైలర్‌ చూపిస్తున్న తాలిబన్లు.. మునుముందు ఫుల్‌ మూవీ తప్పదంటూ భయపెడుతున్నారు. ఇటీవల తాలిబన్లు మహిళల్ని చదువుకోవడానికి నిరాకరించగా.. ఇంకెన్ని హక్కులను కాలరాస్తోరోననే సందేహాలు, భయాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇక తాజాగా రెండు దశాబ్దాల క్రితం అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన కఠిన శిక్షలను మళ్లీ రిపీట్ చేయాలని తాలిబన్లు భావిస్తున్నారు. ఇస్లామిక్ చట్టం ప్రకారం తప్పు చేసినవారికి బహిరంగ ఉరి, చేతులు, కాళ్లు నరికివేతలు వంటి శిక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

తాలిబాన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్ తురాబీ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. గతంలో తాము బహిరంగంగా శిక్షలు అమలు చేసినప్పుడు చాలా దేశాలు తమపై విమర్శలు గుప్పించాయన్న నూరుద్దీన్.. అలా విమర్శించిన దేశాల చట్టాలు, శిక్షల గురించి తామెప్పుడూ కామెంట్‌ చేయలేదని తెలిపారు. ఇక తమ దేశ చట్టాల గురించి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఇస్లాం ను అనుసరిస్తూ ఖురాన్‌ ప్రకారమే తమ చట్టాలు ఉంటాయని తెలిపారు.

దేశ భద్రత దృష్ట్యా కాళ్లు, చేతులు నరికేయడం లాంటి శిక్షల అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పాలసీపై తాము పనిచేస్తునట్లు తురాబీ స్పష్టం చేశారు. అయితే ప్రజలు ఫోన్లు, టీవీలను వినియోగించుకునేందుకు అనుమతిస్తామని తెలిపారు. బహిరంగ శిక్షలను వీడియోలు తీసి పంపడానికి ఫోన్ లాంటి మాధ్యమాలు ఉపయోగపడతాయన్న తురాబీ.. తద్వారా శిక్షలపై ప్రజల్లో అవగాహన, భయం ఏర్పడుతాయన్నారు.

Tags:    

Similar News